Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

అజ్ఞాతంలోకి ప్రధాని: కుటుంబంతో సహా: దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసన మంటలు..రాజధాని ముట్టడి

వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంపై కెనడాలో నిరసనలు…దేశరాజధానిని చుట్టుముట్టిన ఆందోళనకారులు
వేలాది వాహనాలతో రాజధాని ఒట్టావా చేరుకున్న నిరసనకారులు
మాటిమాటికి లాక్ డౌన్ లపై ఆగ్రహావేశాలు
మాస్క్ తప్పనిసరిపై పెరుగుతున్న అసంతృప్తి …
అజ్ఞాతంలోకి ప్రధాని జస్టిన్ ట్రూడో సహా కుటుంబసభ్యులు
దేశరాజధాని ఒట్టావా లోని పార్లమెంట్ భవనం ,ప్రధానినివాసాల వద్ద మోహరించిన బలగాలు

కెనడాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు చెలరేగాయి. లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను చేపట్టారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది వాహనాలు, ట్రక్కుల ద్వారా ఆందోళనకారులు రాజధానిని చుట్టుముట్టారు. కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ సైతం వారిని నిలువరించలేకపోయింది. భారీ ట్రక్కులతో వారు రాజధానిలోకి ప్రవేశించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో- భద్రత బలగాలు అప్రమత్తం అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో, ఆయన కుటుంబ సభ్యులను అజ్ఞాత ప్రదేశానికి తరలించాయి. ప్రధానమంత్రి కార్యాలయం, అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టే ప్రమాదం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పక్కా సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. జస్టిన్ ట్రుడో, ఆయన కుటుంబ సభ్యులు రాజధాని ఒట్టావాలో గల అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారని కెనడా మీడియా తెలిపింది.

దీనికంతటికీ కారణం- కరోనా వ్యాక్సినేషన్. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జస్టిన్ ట్రుడో ప్రభుత్వం తప్పనిసరి చేయడమే. దేశ ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించి తీరాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని సూచించింది. దీనికి అనుగుణంగా తరచూ లాక్‌డౌన్‌లను అమలు చేస్తామని తెలిపింది.

దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు భారీ ట్రక్కులతో ఒట్టావాకు చేరుకున్నారు. స్వస్తిక్‌ను ముద్రించిన జెండాలను ప్రదర్శించారు. ప్లకార్డులతో తమ నిరసనను తెలియజేశారు. కరోనా ఆంక్షల నుంచి స్వేచ్ఛ కావాలంటూ నినదించారు. కోవిడ్ ప్రొటోకాల్స్, మాస్కుల ధారణ, లాక్‌డౌన్ల నుంచి తమకు విముక్తి కల్పించాలంనే బ్యానర్లను ప్రదర్శించారు. కెనడియన్లు హీరోగా అభిమానించే టెర్రీఫాక్స్ విగ్రహాలను ఒకట్రెండు ట్రక్కులపై తీసుకొచ్చారు.

తొలుత- 10 వేల మందితో ఈ నిరసన ప్రదర్శన మొదలైందని, క్రమంగా ఇది వేలాదిమంది ఇందులో చేరారని కెనడియన్ మీడియా తెలిపింది. పార్లమెంటరీ ప్రొటెక్టివ్ సర్వీస్ వేసిన అంచనాలను తమ కథనాల్లో ఉటంకించింది. ఈ వ్యతిరేక ప్రదర్శనలు హింసాత్మక పరిస్థితులకు దారి తీయవచ్చనే ఉద్దేశంతో భద్రత బలగాలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నట్లు మీడియా పేర్కొంది. నిరసన ప్రదర్శనలు కాస్తా దాడులుగా పరిణమించే ప్రమాదం ఉన్నట్లు పార్లమెంటరీ ప్రొటెక్టివ్ సర్వీస్ అంచనా వేసినట్లు స్పష్టం చేసింది.

ఒట్టావాను చుట్టముట్టిన ఆందోళనకారులు అక్కడి వార్ మెమెరియల్ వద్ద బైఠాయించారు. కాగా- అనూహ్యంగా తలెత్తిన ఈ పరిణామాలతో భద్రత సిబ్బంది, పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం, అధికారిక నివాసం సహా ప్రభుత్వ భవనాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆందోళనకారులను నియంత్రించడానికి కొన్ని చోట్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది.

Related posts

కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచండి: ప్రధాని మోదీ!

Drukpadam

చైనా కరోనా వ్యాక్సిన్ ‘సినోవాక్’ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి…

Drukpadam

అమెరికా నో మాస్క్-బట్ వన్ కండిషన్ … వ్యాక్సిన్ తీసుకుంటే

Drukpadam

Leave a Comment