మోదీ ప్రధాని అయ్యింది ఉల్లిపాయల ధరలు తగ్గించడానికి కాదు!: కేంద్ర మంత్రి పాటిల్
- ప్రజలు మటన్ కోసం రూ.700 ఖర్చుపెడతారు
- కానీ, ఉల్లిగడ్డలకు రూ.10, టమాటాకు రూ.40 పెట్టడం ఖరీదనిపిస్తోంది
- ధరల పెరుగుదలకు అసలు కారణం తెలుసుకోవాలి
- దేశం కోసం మోదీ, షా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు
- 2024లోగా పీవోకే కూడా మన చేతికి వస్తుందన్న మంత్రి
దేశం కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ అన్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్ పట్టణంలో ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు.
ప్రధాని మోదీ అయ్యింది ఉల్లిపాయలు, బంగాళా దుంపల ధరలు తగ్గించేందుకు కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగాయంటూనే, మరోవైపు పిజ్జా, మటన్ కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. అయితే, నిత్యావసరాల అధిక ధరలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు.
‘‘ప్రజలు మటన్ కోసం రూ.700, పిజ్జా కోసం రూ.500-600 ఖర్చు చేస్తున్నారు. కానీ, ఉల్లిగడ్డలకు రూ.10, టమాటోకు రూ.40 పెట్టడం వారికి ఖరీదుగా అనిపిస్తోంది. పెరిగే ధరలను ఎవరూ సమర్థించరు. కానీ, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యింది ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల ధరలు తగ్గించేందుకు కాదు. ధరల పెరుగుదల వెనుక కారణాన్ని మీరు అర్థం చేసుకుంటే ప్రధానిని విమర్శించరు.
కేవలం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే దేశం కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలరు. ప్రధాని మోదీయే దేశాన్ని పాలించాలి. ఆయన ఆర్టికల్ 370, 35ను రద్దు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) సైతం 2024లోపే భారత్ చేతికి వస్తుందని నేను భావిస్తున్నాను’’ అంటూ మంత్రి పాటిల్ తన అభిప్రాయాలను వెల్లడించారు.