రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్ కట్ చేసిన టీఆర్ యస్ ఎంపీలు …వీళ్లకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్న బండి సంజయ్!
-తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు నిర్ణయం
-కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరుకి నిరసన
-విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్
-నాడు గవర్నర్ ను, నేడు రాష్ట్రపతిని అవమానించారు: బండి సంజయ్
-నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
-రాష్ట్రపతి ప్రారంభ ప్రసంగం
-బాయ్ కాట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు
-తీవ్రంగా ఖండించిన బండి సంజయ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మండిపడ్డారు . టీఆర్ యస్ ఎంపీలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకంలేదు . వీరి చర్యలు సహేతుకం కాదని విమర్శించారు.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరుకి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు విడుదల చేయాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పోరాడతామని తెలిపారు.
పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం నేపథ్యంలో బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సభలో టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని టీఆర్ఎస్ నేతలు నాడు గవర్నర్ ను అవమానించారని, నేడు రాష్ట్రపతిని కూడా అవమానించారని విమర్శించారు.
గవర్నర్ ప్రసంగంలో తమ సంవత్సరకాలపు అభివృద్ధి గురించి చెబుతారా? లేక ప్రతి పక్షాల గురించి చెబుతారా? అని అధికార టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. ఈ కనీసజ్ఞానం లేని సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ వారి ఎంపీలను ఆదేశించడం నియంతృత్వ ఆలోచనలకు నిదర్శనం అని విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని, రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల తెలంగాణకు కలిగే కొత్త ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని బండి సంజయ్ హితవు పలికారు.
ఇవాళ రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రధాని మోదీ నాయకత్వంలో గత సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ విజయాలను స్పష్టంగా వివరించారని తెలిపారు. తెలంగాణ ప్రజల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.