కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసన … రేపు మౌనదీక్ష చేపట్టనున్న బండి సంజయ్!
-రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
-మార్చాలసింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ ను
-రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ దేశద్రోహి
-తెలంగాణ వ్యాప్తంగా రేపు బీజేపీ శ్రేణుల దీక్ష
-రాజ్ ఘాట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్న బీజేపీ ఎంపీలు
కేసీఆర్ మంగళవారం హైద్రాబాద్ లో పెట్టిన ప్రెస్ మీట్ పెద్ద దుమారాన్ని లేపింది. బీజేపీ పై ,ప్రధాని మోడీపై కేసీఆర్ దుమ్మెత్తి పోశారు . దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లు ఎత్తుతున్నాయి. దళిత సంఘాలు కేసీఆర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. బీజేపీ ఎంపీలు గురువారం ఢిల్లీ లో నిరసనలు చేపట్టనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మౌనదీక్షకు దిగబోతున్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలంటూ నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు దీక్షను చేపట్టబోతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రేపు ఢిల్లీలో మౌన దీక్షను చేపట్టబోతున్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రహ్మణ్యం తదితర నేతలతో కలసి ఆయన దీక్షకు దిగనున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు.
మరోవైపు బండి సంజయ్ ఈరోజు మాట్లాడుతూ, కేసీఆర్ దేశద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, సీఎం కేసీఆర్ ను అని అన్నారు.