కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు.. దేశంలో నరేంద్ర మోదీ రాజ్యాంగం అమలవుతోంది: మంత్రి తలసాని ఫైర్
- రాజ్యాంగాన్ని సవరించాలన్న కేసీఆర్
- భగ్గుమన్న బీజేపీ, కాంగ్రెస్
- కేసీఆర్ వ్యాఖ్యలపై తలసాని వివరణ
- బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం
- కుక్కల్లా మొరుగుతున్నారని వ్యాఖ్యలు
కొంతకాలంగా కేంద్రంతో పలు అంశాల్లో పోరాట పంథా అనుసరిస్తున్న తెలంగాణ సర్కారు, బడ్జెట్ అనంతరం నిప్పులు చెరుగుతోంది. దేశంలో రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
దేశంలో నరేంద్ర మోదీ రాజ్యాంగం అమలవుతోందని ఆయన విమర్శించారు. రాజ్యాంగాన్ని సవరిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారని వివరణ ఇచ్చారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్థించారు. అయితే దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలని స్పష్టం చేశారు.
బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్ పేయి అప్పట్లో ఎందుకు రాజ్యాంగ పునర్ పరిశీలన కమిషన్ ఏర్పాటు చేశారని తలసాని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులపై ప్రేమ ఉంటే బడ్జెట్ లో చూపించాలని హితవు పలికారు. అంబేద్కర్ కు తామే నిజమైన వారసులమని, అందుకే దళితబంధు, సబ్ ప్లాన్ తీసుకువచ్చామని తలసాని వెల్లడించారు.
అంతకుముందు, కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు బుద్ధుందా? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగంలోని మౌలికసూత్రాలు మార్చాలనుకున్న ఇందిరాగాంధీకి దేశ ప్రజలు చుక్కలు చూపించారని, కేసీఆర్ కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్ జాతీయ జెండాను కూడా మార్చాలంటాడేమోనని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఏనాడూ హాజరుకాని నీచుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.
అటు, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాజ్యంగాన్ని మార్చాలన్న కేసీఆర్ మాటలు దేశంపై దాడిగా చూడాలని అన్నారు. ప్రశ్నించే చట్టబద్ధతను రాజ్యాంగం కల్పించిందని, కానీ కేసీఆర్ వ్యాఖ్యలు మేకవన్నె పులి తరహాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఐక్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని భట్టి పిలుపునిచ్చారు. రాజ్యాంగంపై అవగాహనలేని కేసీఆర్ వంటి వ్యక్తి సీఎంగా ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు.