దేశం విడిచి వెళ్లాలంటూ పాక్‌లోని హిందూ వ్యాపారికి హెచ్చరిక.. నిరాకరించడంతో దారుణ హత్య!
- భూమిని అప్పగించాలని డిమాండ్
- కళ్లు పొడిచి, కాళ్లు, చేతులకు గాయాలు
- చావనైనా చస్తాను కానీ వారికి లొంగేది లేదంటూ సెల్ఫీ వీడియో
- కాటన్ ఫ్యాక్టరీ, ఫోర్ మిల్ ప్రారంభోత్సవం సందర్భంగా హత్య
పాకిస్థాన్‌లో మరో దారుణం జరిగింది. సింధు ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లాకు చెందిన సతన్‌లాల్ అనే హిందూ వ్యాపారిని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. అంతకుముందు ఆయనకు ఉన్న భూమిని తమకు అప్పగించాలని, దేశం విడిచి వెళ్లిపోవాలని బెదిరించారు. అందుకాయన నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
దహర్ సామాజిక వర్గానికి చెందిన వారు తనను కొన్నేళ్లుగా బెదిరిస్తున్నట్టు సతన్‌లాల్ ఇటీవల ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. వారు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, కళ్లు పొడిచారని, కాళ్లు, చేతులపై కత్తితో గాయాలు చేశారని ఆ వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను దేశం విడిచి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారని అన్నారు. తాను ఈ దేశానికి చెందినవాడినని, చావనైనా చస్తాను కానీ వారికి మాత్రం లొంగేది లేదని స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టుతో పాటు స్థానిక అధికారులను కూడా వేడుకున్నారు.
అంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. సతన్‌లాల్‌కు చెందిన భూమిలో ఏర్పాటు చేసిన కాటన్ ఫ్యాక్టరీ, ఫ్లోర్ మిల్ ప్రారంభోత్సవం జరుగుతుండగా వచ్చిన దుండగులు ఆయనను కాల్చి చంపారు. సతన్‌లాల్ స్నేహితుడు ముఖి అనిల్ కుమార్‌ను ఉటంకిస్తూ ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ఈ విషయాన్ని వెల్లడించింది. లాల్ హత్యకు నిరసనగా మంగళవారం ఘోట్కీ జిల్లాలో నిరసనలు చేపట్టారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బచల్ దహార్, అతడి మద్దతుదారులను అరెస్ట్ చేశారు.