‘అల మేఘాల్లో’ ప్రపంచంలోనే ఎత్తైన రైల్ బ్రిడ్జి.. మనోహర దృశ్యాన్ని పంచుకున్న భారత రైల్వే..
- జమ్మూకశ్మీర్ లోని రియాసీలో నిర్మాణం
- చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో వంతెన
- ఐఫిల్ టవర్ కన్నా ఎత్తు 35 మీటర్లు ఎక్కువ
- 266 కిలోమీటర్ల గాలులనూ తట్టుకునే శక్తి
- 8 తీవ్రతతో భూకంపం వచ్చినా చెక్కుచెదరదు
‘మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగిపొమ్మన్నది’ అంటూ అప్పట్లో ఓ కవి వర్ణించాడు. అవును మరి, అల్లంత ఎత్తులో పాల తరగల్లాంటి మేఘాల్లో ఎగిరిపోతుంటే వచ్చే ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుందో కదా! అలాంటి అనుభూతిని కల్పించేందుకు భారత రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఓ రైల్వే వంతెనను కట్టేస్తోంది.
జమ్మూకశ్మీర్ లోని రియాసీలో చినాబ్ నదిపై కొండలను కలుపుతూ ఆ వంతెనను నిర్మిస్తోంది. మేఘాల పునాదులపై ఆవిష్కృతమైన ఆ ముగ్ధ మనోహర దృశ్య కావ్యాన్ని భారత రైల్వే అందరితో పంచుకుంది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఓ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
2002లో ప్రారంభమైన ఈ ‘ఆర్చ్ బ్రిడ్జి’ నిర్మాణం పూర్తి కావస్తోంది. నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ ‘చినాబ్ రైలు వంతెన’ను నిర్మిస్తున్నట్టు రైల్వే తెలిపింది. ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎక్కువ ఎత్తుండే ఈ వంతెనను.. రియాసీలోని బక్కల్, కౌరీ మధ్య నిర్మిస్తున్నారు. కశ్మీర్ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడంలో ఈ వంతెనది కీలకపాత్ర అని చెబుతుంటారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్ లో భాగమైన ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లాకు లింక్ చేసేస కత్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల స్ట్రెచ్ ను ఈ రైల్వే బ్రిడ్జి లింక్ చేస్తుంది.
ఈ వంతెనను 1,315 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఆర్చ్ పై రైల్వే ట్రాక్ నిలబడేలా 17 ఇనుప పిల్లర్లతో రైల్ బ్రిడ్జిని కడుతున్నారు. ఆర్చ్ పొడవే 476 మీటర్లుంటుంది. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకుని ఈ వంతెన నిలబడుతుంది. కాగా, ఈ ఫొటోలను రైల్వే శాఖ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదో సివిల్ ఇంజనీరింగ్ అద్భుతమని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. భూమి మీదకు స్వర్గం దిగొచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు.