కరోనా వచ్చి పోయిన ఏడాది తర్వాత కూడా గుండెకు ముప్పు!
- గుండె స్పందనలు అస్తవ్యస్థం
- గుండె కండరాల్లో వాపు
- హార్ట్ ఎటాక్, మరణ మప్పు
- అమెరికా పరిశోధకుల గుర్తింపు
‘హమ్మయ్య.. కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాం’ అని అనుకుంటున్నారా..? అలా అని ఆరోగ్యం పట్ల శ్రద్ధ విస్మరించకండి. ఎందుకంటే కరోనా వచ్చి పోయిన ఏడాది తర్వాత కూడా గుండె వైఫల్యం, గుండె జబ్బులు బయట పడొచ్చంటూ అమెరికాలో చేసిన ఒక పరిశోధనలో తెలిసింది. ఈ పరిశోధన వివరాలు నేచర్ మెడిసిన్ అనే మేగజైన్ లో ప్రచురితమయ్యాయి.
గుండె స్పందనలు గతి తప్పడం, గుండె కండరాల్లో వాపు, రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఎటాక్, గుండె వైఫల్యం, మరణ ముప్పు ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. కరోనా వైరస్ తో ఆస్పత్రిలో చేరి, బయటపడిన వారికే ఈ ముప్పు ఉంటుందని అనుకోవద్దు. గతంలో ఆరోగ్యంగా ఉండి, స్వల్ప కరోనా లక్షణాలు చూసిన వారిలోనూ ఇవి బయటపడొచ్చని పరిశోధకులు తెలిపారు.
‘‘మేము పరిశోధనలో గమనించిన అంశాలు మంచి సంకేతాలు కావు. కరోనా వైరస్ తీవ్రమైన గుండె జబ్బులు, ప్రాణాంతకానికీ దారితీయవచ్చు. గుండె దెబ్బతిన్న తర్వాత తిరిగి సాధారణ స్థితికి రావడం ఉండదు’’ అని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియాల్ అల్అలీ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 1.5 కోట్ల మంది గుండె జబ్బు బాధితులుగా మిగిలిపోయారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడి కోలుకున్న ప్రతి ఒక్కరికీ గుండె ఆరోగ్యం కీలకమని అలీ సూచించారు. కరోనా రాకముందు గుండె జబ్బులున్న వారికి ముప్పు అధికమవుతోందని చెప్పారు.
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో 4 శాతం మందికి గుండె జబ్బుల రిస్క్ ఉంటుందని, గుండె పోటు ముప్పు 52 శాతం మందికి, రక్త నాళాల్లో పూడికల ముప్పు 72 శాతం మందికి, స్ట్రోక్ ముప్పు 52 శాతం మందికి ఉంటుందని పరిశోధకులు తెలిపారు.