జాతీయ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాలకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టుకు కూడా కష్టాలే!
- ఇకపై జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి 60 శాతం నిధులే
- 40 శాతం నిధులను రాష్ట్రాలే భరించాలి
- రాష్ట్ర వాటా ఖర్చు చేసిన తర్వాతే కేంద్ర నిధుల విడుదల
అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా… కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం 60 నిధులు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. మిగిలిన 40 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. అంతేకాకు మరో దిమ్మతిరిగే నిబంధనను తీసుకొచ్చింది. నిబంధన ప్రకారం తొలుత రాష్ట్రాలు తమ వాటా నిధులను విడుదల చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల అవుతాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను పంపింది.
ఇప్పటి వరకు జాతీయ హోదా లభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను ఇస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం 60 శాతానికి తగ్గనుంది. అంతే కాదు కేంద్ర నిధులను పొందే ప్రక్రియ కూడా సంక్లిష్టంగా మారనుంది. ఇకపై జాతీయ హోదా కల్పించడం కూడా కష్టతరంగా మారనుంది. ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ… ఆ నిర్దిష్ట సమయంలో అందుబాటులో ఉన్న నిధులు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టే జాతీయ హోదాను కల్పిస్తారు. తాజా నిబంధనతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరంకు 60 శాతం నిధులు మాత్రమే అందే అవకాశం ఉంది.