కోడిపుంజుకు రూ. 30 టికెట్ వసూలు చేసిన కండక్టర్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్…
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో బస్సు కండక్టర్ నిర్వాకం
- సోషల్ మీడియాకు ఎక్కడంతో దుమారం
- విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న సజ్జనార్
కోడిపుంజుకు రూ. 30 టికెట్ వసూలు చేసిన ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సంబంధిత కండక్టర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం కరీంనగర్‌కు వెళ్తోంది. రామగుండం బి పవర్‌హౌస్ వద్ద మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సెక్కాడు.
వెంట తెచ్చుకున్న కోడిపుంజును ఓ పెట్టెలో పెట్టి దానిపై గుడ్డ కట్టాడు. బస్సు సుల్తానాబాద్‌కు చేరుకోగానే బస్సు కుదుపులకు పుంజు ఒక్కసారిగా అరిచింది. గమనించిన కండక్టర్ తిరుపతి కోడిపుంజుకు కూడా రూ. 30 టికెట్ తీసుకోవాలని గద్దించాడు. దీంతో చేసేది లేక అలీ టికెట్ తీసుకున్నాడు. ఈ విషయం కాస్తా సామాజిక మాధ్యమాలకు ఎక్కింది. ఇది చూసిన నెటిజన్లు ఆర్టీసీపై దుమ్మెత్తి పోశారు. దీంతో స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.