Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

చిరంజీవి సీఎం జగన్ తో మాట్లాడినట్లుగాలేదు …యాచించినట్లు ఉంది:తమ్మారెడ్డి!

చిరంజీవి ఆయన స్థాయిని మరిచి జగన్ ను అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదు: తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

  • జగన్ తో చిరంజీవి మాట్లాడుతున్న వీడియో చూసి చాలా బాధ పడ్డాను
  • ఆత్మ గౌరవాన్ని పక్కన పెట్టి యాచించినట్టుగా ఉంది
  • టికెట్ ధరలు తప్ప ఇతర సమస్యలను ప్రస్తావించినట్టు లేదు

సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలంటూ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ లతో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం సందర్భంగా జగన్ ను ప్రాధేయపడినట్టుగా చిరంజీవి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి తన స్థాయిని మరిచి అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదని అన్నారు. దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

సీఎంతో భేటీ తర్వాత అంతా బాగా జరిగిందని సినీ ప్రముఖులు చెప్పడం సంతోషకరమని తమ్మారెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసిందుకు చిరంజీవికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పెద్దగా తాము భావిస్తున్నామని… ఆయనకు కూడా ఓ ఆత్మగౌరవం ఉంటుందని చెప్పారు. స్వతహాగా చిరంజీవే చాలా పెద్దమనిషని, ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా కూడా సీఎం దగ్గరకు వెళ్లారని తెలిపారు.

సీఎంతో చిరంజీవి మాట్లాడుతున్న వీడియో చూసినప్పుడు తనకు చాలా బాధేసిందని తమ్మారెడ్డి అన్నారు. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి యాచించనట్టుగా ఉందని, ఆయన అలా అడగడం చూసి మనం ఇలాంటి దారుణమైన స్టేజ్ లో ఉన్నామా? అని బాధేసిందని చెప్పారు. ఈ భేటీలో కేవలం సినిమా టికెట్ ధరల గురించే తప్ప ఇతర సమస్యల గురించి ప్రస్తావన వచ్చినట్టు అనిపించడం లేదని అన్నారు. వైజాగ్ లో స్థలాలు ఇస్తామని, ఇండస్ట్రీని అక్కడ అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారని… ఆయన ఇతర సమస్యలపై కూడా స్పందించి ఉంటే అందరం సంతోషించేవాళ్లమని చెప్పారు.

సినిమాలు విడుదల కాకపోవడానికి కరోనానే కారణమని తమ్మారెడ్డి అన్నారు. కానీ, టికెట్ ధరల వల్ల సినిమాలు విడుదల కాలేదని చిరంజీవి చెప్పడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు మంచి వసూళ్లను సాధించాయని చెప్పారు. మరో రూ. 20 నుంచి 25 కోట్ల అధిక వసూళ్ల కోసం ఇండస్ట్రీ దిగ్గజాలు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి వారు అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

చిరంజీవి వంటి అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అడగడం బాధగా ఉందని చెప్పారు. మనం శాసించే వాళ్లం కాకపోయినా, ట్యాక్సులు కడుతున్నవారమని అన్నారు. మన గౌరవాన్ని కాపాడుకుంటూనే మనం మాట్లాడాలని… అణగారిపోయిన వర్గంలా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన తర్వాత తనకు చాలా బాధగా అనిపించిందని అన్నారు.

Related posts

వికారాబాద్ లో పరిసరాల్లో బైక్ పై పవన్ కళ్యాణ్!

Drukpadam

‘డోలో–650’ మాత్రలు తయారు చేసే ఫార్మా కంపెనీపై ఐటీ దాడులు!

Drukpadam

అల్లు అర్జున్.. మిమ్మ‌ల్ని చూస్తే గ‌ర్వంగా ఉంది: ప్ర‌కాశ్ రాజ్‌

Ram Narayana

Leave a Comment