3 రాజధానులపై కేంద్ర మంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు!
- ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదు
- అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదు
- హోదా గురించి మోదీతో జగన్ మాట్లాడాలి
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికీ రాష్ట్ర మంత్రులు చెపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ… ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదని… అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరి కాదని అన్నారు. రెండు చోట్ల రాజధానులు పర్వాలేదని… మూడు రాజధానులతో ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని… కానీ, మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టమని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కలసి కోరాలని సూచించారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో జగన్ చేతులు కలపాలని హితవు పలికారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం తాను కూడా ప్రయత్నిస్తానని చెప్పారు. పార్లమెంటులో పెట్టే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తోందని తెలిపారు.