రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం!
- రాష్ట్ర వ్యాప్తంగా పీఎస్‌ల ముందు ధర్నాకు టీపీసీసీ పిలుపు
- అసోం సీఎం హిమంతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్
- కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటోన్న పోలీసులు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో టీపీసీసీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటివద్ద పోలీసులు మోహరించారు. హైదరాబాద్ కమిషనరేట్ ముందు ధర్నా చేయడానికి వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రణాళిక వేసుకోవడంతో ఆయనను గృహ నిర్బంధం చేశారు. ధర్నాకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు.
అలాగే, హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు మాధుయాష్కి, షబ్బీర్ అలీని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు, నిజామాబాద్ లో మధుయాష్కిని హౌస్ అరెస్టు చేశారు. అలాగే, పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ తాము ధర్నాలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.