Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి హఠాన్మరణం… జ‌గ‌న్ స‌హా ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి!

ఏపీ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి హఠాన్మరణం… జ‌గ‌న్ స‌హా ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి!

  • మేక‌పాటి హ‌ఠాన్మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాను: జ‌గ‌న్
  • చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారు:  బొత్స‌
  • మేక‌పాటి కుటుంబానికి ప్రగాఢ‌ సానుభూతి: విజ‌య‌సాయిరెడ్డి
  • తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాను:  లోకేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల పలువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న కార్యక్ర‌మాల‌న్నింటినీ వాయిదా వేసుకున్నారు. ఐటీ మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌతం రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని జ‌గ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డార‌ని అన్నారు. తాను సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందని చెప్పారు. ఆయన కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్ రెడ్డి గారు రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ‌ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాను. ఫిట్నెస్‌కి అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రి గారికి గుండెపోటు రావ‌డం అత్యంత విచార‌క‌రం. విదేశాల‌లో ఉన్న‌త‌ విద్యాభ్యాసం చేసి వ‌చ్చినా విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామా. ఐదుప‌దుల వ‌య‌స్సులోనే హుందా గ‌ల రాజ‌కీయ‌వేత్త‌గా పేరుగాంచిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మ‌న‌కి దూరం కావ‌డం తీర‌ని విషాదం. మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను’ అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

‘ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం బాధాకరం. వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలుపుతున్నాను’ అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు.

‘ఆసుప‌త్రికి ఫోన్ చేశాను. ఆయ‌న మృతి చెందార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. నిన్న రాత్రి కూడా ఆయ‌న చాలా చురుకుగా ఉన్నారు. ఈ రోజు గౌతం లేరన్న వార్త బాధ క‌లిగిస్తోంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను’ అని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు.

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మేక‌పాటి గౌతం రెడ్డి చాలా యాక్టివ్‌గా ఉండేవారని, ఏపీ మంత్రి వ‌ర్గంలో మంచి పేరు తెచ్చుకున్నార‌ని సీపీఐ నేత నారాయ‌ణ అన్నారు. మేక‌పాటి గౌతంరెడ్డి హఠాన్మరణం ప‌ట్ల ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

హైద‌రాబాద్‌ అపోలో ఆసుప‌త్రికి ష‌ర్మిల‌.. కాసేప‌ట్లో జ‌గ‌న్‌, చంద్ర‌బాబు కూడా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి వార్త తెలుసుకున్న ప్ర‌ముఖులు అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే అపోలో ఆసుప‌త్రికి చేరుకున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల ఆయ‌న పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే, ఆసుప‌త్రి వ‌ద్ద‌కు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి చేరుకున్నారు.

మ‌రోవైపు, త‌న కార్యక్ర‌మాల‌న్నింటినీ వాయిదా వేసుకున్న ఏపీ సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి నుంచి హైద‌రాబాద్ చేరుకుని అపోలో ఆసుప‌త్రికి వెళ్లి మేక‌పాటి గౌతం రెడ్డి పార్ధివ దేహాన్ని సంద‌ర్శిస్తారు. అలాగే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా కాసేప‌ట్లో అపోలో ఆసుప‌త్రికి వెళ్ల‌నున్నారు.

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

గౌతమ్ రెడ్డి మరణం ఎంతో బాధను కలిగిస్తోంది: జగన్, కేవీపీ రామచంద్రరావు

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరినీ దిగ్భాంతికి గురి చేస్తోంది. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నేత గౌతమ్ రెడ్డి అని జగన్ అన్నారు. గౌతమ్ మృతి ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత ఆవేదనను కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముందు నుంచి కూడా జగన్ తో గౌతమ్ రెడ్డికి అనుబంధం ఉంది.

గౌతమ్ రెడ్డి మృతి పట్ల మాజీ పార్లమెంటు సభ్యులు కేవీపీ రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. రాజకీయాల్లో స్తబ్దుగా ఉండొద్దని, ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేయాలని తనను కోరేవాడని తెలిపారు. ఎంతో ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉన్న గౌతమ్ చిన్న వయసులోనే ఆకస్మిక మరణానికి గురి కావడం బాధాకరమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గౌతమ్ తండ్రి రాజమోహన్ రెడ్డి కుటుంబంతో దివంగత రాజశేఖరరెడ్డికి, తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల తెలంగాణ నేత‌ల సంతాపం
దిగ్భ్రాంతికి గుర‌య్యా: కేటీఆర్
మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత
ఆయ‌న‌ మరణం కలచివేసింది: రేవంత్ రెడ్డి
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: ష‌ర్మిల‌
గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి త‌ల‌సాని నివాళులు

ఏపీ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారి హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. గౌతమ్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ నేత‌లు సంతాపం తెలిపారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుప‌త్రికి వెళ్లిన తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్… గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

గౌత‌మ్ రెడ్డి మృతి చెందార‌న్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గుర‌యిన‌ట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయ‌న‌ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కేటీఆర్ సానుభూతి తెలిపారు.

గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత మరణం కలచివేసిందని ఆయ‌న ట్వీట్ చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

త‌న ప్రియ మిత్రుడు మేక‌పాటి గౌతం రెడ్డి ఇక లేర‌న్న వార్త‌ దిగ్భ్రాంతికి గురిచేసిందని ష‌ర్మిల అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ష‌ర్మిల‌ ట్వీట్ చేశారు.

Related posts

ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తాం: కేంద్రమంత్రి గడ్కరీ!

Drukpadam

హిజాబ్ వివాదంలో కుదరని ఏకాభిప్రాయం …

Drukpadam

పెళ్లి చేసుకున్నా అత్యాచారం కేసు అలానే ఉంటుంది: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment