Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం మరువలేనిది…మంత్రి సింగిరెడ్డి

  • రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జర్నలిస్ట్ భవనం నిర్మిద్దాం.
  • -అర్హులైన పేద దళిత జర్నలిస్టుకు దళితబందు మంజూరుకు కృషి.
  • -టౌన్ లో మొదటి విడతగా 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
  • -విడతలవారీగా ప్రతి సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు.
  • -రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
  • -జర్నలిస్టుల పక్షపాతి మంత్రి నిరంజన్ రెడ్డి.. యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్.
  • -ఘనంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) డైరీ ఆవిష్కరణ.

= వనపర్తి టౌన్:- ఉమ్మడి జిల్లా తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జర్నలిస్టులు అందిస్తున్న సహకారం మరువలేనిదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్ట్ యూనియన్ 2022 డైరీ ఆవిష్కరణ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… స్వలాభం కోసం కాకుండా భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించే పని ఏదైనా నా ఆత్మ సంతృప్తి గా ఉంటుందని ఆయన అన్నారు. జర్నలిస్ట్ భవన్ ఏ ఒక్కరికో పరిమితం కాదని, రానున్న తరాల జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కావున జర్నలిస్ట్ భవనం కోసం స్థలం కేటాయించి, రూ. 25 లక్షలతో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మొదటి జర్నలిస్టు భవనం నిర్మించుకుందామని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు, సాధకబాధకాలు క్షేత్రస్థాయిలో తనకు తెలుసని, నేటికి అనేక మంది జర్నలిస్టులు కడు పేదరికంలో ఉన్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించి యూనియన్ తరపున లిస్టు తనకు ఇవ్వాలని, విడతలవారీగా ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు పోదామని అన్నారు. ప్రతి మండల కేంద్రాల్లో కూడా ప్రెస్ క్లబ్ లు నిర్మించుకుందామని అందుకు తనకు సమయం ఇవ్వాలని జర్నలిస్ట్ లను కోరారు. దళిత బంధు విషయంలో కూడా అర్హులైన పేద దళిత జర్నలిస్టులు ఉంటే వారికి దళిత బంధు వర్తింప చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. మొదటగా టౌన్ లో 50 మంది ఇల్లు లేని జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జర్నలిజం వృత్తి అంటేనే కత్తి మీద సాము లాంటిదని, అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ అడపాదడపా విమర్శలు రావడం పరిపాటిగా పెరుగుతూనే ఉంటుంది అన్నారు. అలాంటి సందర్భంలోనే జర్నలిస్టులు లోతుగా అధ్యయనం చేసి నిజాలను ప్రజల ముందు చూపించాలని కోరారు. జర్నలిస్టుల సహకారం రానున్న రోజుల్లో తనకు ఇలాగే ఉంటే ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి అన్నారు.

గుండ్రాతి మధు గౌడ్ మాట్లాడుతూ… ప్రజాక్షేత్రంలో ప్రజలకు నిజమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందించే ఏ రాజకీయ పార్టీ అయినా జర్నలిస్టుల తరఫున తమ సంపూర్ణ సహకారాలు ఉంటాయని అన్నారు. జర్నలిస్టుల భవనం కోసం స్థలం కేటాయించి రూ. 25 లక్షలు నిర్మాణం కోసం ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. యూనియన్ తరపున తాము ఏది చేసినా పదిమంది జర్నలిస్టుల మేలు కోసమే కష్టపడుతున్నామని తమ కష్టానికి మంత్రి సహకారం తోడు కావడం సంతోషం కలిగిస్తోందన్నారు. నేటికి అనేక మంది జర్నలిస్టులకు సొంత ఇంటి స్థలాలు లేవని, మంత్రి సహకరించి జర్నలిస్టుల సొంతింటి కలను కూడా నెరవేర్చాలని కోరారు. గతంలో వనపర్తి ని విద్యా పర్తి గా పిలిచేవారని, మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలో వనపర్తి జిల్లా కేంద్రం కావడం, జిల్లాలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు కావడంతో నేడు వనపర్తి నిజమైన విద్యా పర్తి గా పూర్తిస్థాయిలో అవతరించింది అన్నారు. అభివృద్ధి విషయంలో తాము రాజకీయాలకతీతంగా మంత్రికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ సభ్యులు నోముల రవీందర్ రెడ్డి పోలిశెట్టి బాలకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోలమోని రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు, సీనియర్ జర్నలిస్టులు కొండన్న యాదవ్, పౌర్ణ రెడ్డి, ఉషన్న, జిల్లా హెల్త్ కన్వీనర్ గంధం దినేష్, ముంత భాస్కర్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మన్యం, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు, నవీన్ కుమార్ గౌడ్, శివ, ఉపాధ్యక్షుడు అంజి, మండల రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒక్క గుడ్డుతో 15 మందికి ఆమ్లెట్!

Drukpadam

ఏపీలో 54 క‌ర‌వు మండ‌లాలు.. జాబితా విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం!

Ram Narayana

ఏపీ స‌ల‌హాదారు ప‌దవికి రాజీనామా చేసిన ముర‌ళి…

Drukpadam

Leave a Comment