Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రష్యా వార్నింగ్ ను లెక్కచేయకుండా ప్రాణత్యాగం చేసిన ఉక్రెయిన్ సైనికులు

స్నేక్ ఐలాండ్ లో వీరోచిత ఘట్టం… రష్యా వార్నింగ్ ను లెక్కచేయకుండా ప్రాణత్యాగం చేసిన ఉక్రెయిన్ సైనికులు

  • ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై రష్యా దాడులు
  • నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ లో ఉక్రెయిన్ స్థావరం
  • స్నేక్ ఐలాండ్ కు సమీపానికి వచ్చిన రష్యా నౌక
  • ఉక్రెయిన్ సైనికులకు తొలుత వార్నింగ్
  • బూతు మాటతో బదులిచ్చిన ఉక్రెయిన్ సైనికుడు
  • బాంబుల వర్షం కురిపించిన రష్యా నౌక

రష్యా వంటి పెద్ద దేశం తమపై దురాక్రమణకు తెగించగా, చిన్న దేశమైన ఉక్రెయిన్ ఒంటరిగానే పోరాడుతోంది. ప్రపంచదేశాలేవీ తోడు రాకపోగా, చావోరేవో తేల్చుకోవాలని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడితో పాటు ఆ దేశ సైన్యం కృతనిశ్చయంతో ఉంది. ప్రాణత్యాగాలకు కూడా ఉక్రెయిన్ సైనికులు వెనుకాడడంలేదు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. నల్ల సముద్రంలో ఉక్రెయిన్ కు చెందిన స్నేక్ ఐలాండ్ ఉంది. దీన్నే స్థానికంగా జ్మినిల్ ఐలాండ్ అని కూడా అంటారు.

ఈ దీవిలో ఉక్రెయిన్ కు చెందిన సైనిక స్థావరం ఉంది. తాము ఉక్రెయిన్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటామని చెబుతున్న రష్యా… స్నేక్ ఐలాండ్ లోని మిలిటరీ కేంద్రంపైనా దృష్టి సారించింది. నల్ల సముద్రంలో ఓ రష్యా యుద్ధ నౌక స్నేక్ ఐలాండ్ సమీపంలో మోహరించింది. ఆ నౌక అధికారి… దీవిలో ఉన్న ఉక్రెయిన్ సైనికులకు గట్టి హెచ్చరిక పంపాడు.

“ఇది సైనిక యుద్ధ నౌక… రష్యాకు చెందిన సైనిక యుద్ధనౌక. రక్తపాతాన్ని నివారించడానికి వీలుగా మీరు మీ ఆయుధాలను కిందపడేసి మాకు లొంగిపోండి. లేకపోతే మీపై బాంబుల వర్షం కురిపిస్తాం” అని ఆ రష్యా అధికారి స్పష్టం చేశాడు. అయితే, అవతలివైపు నుంచి ఏమాత్రం లెక్కని చేయని రీతిలో దీటైన సమాధానం వచ్చింది. “రష్యా యుద్ధ నౌకా…? అయితే ఏంటి?” అంటూ ఓ బూతు మాట జోడించి ఉక్రెయిన్ సైనికుడు ఘాటుగా బదులిచ్చాడు.

అక్కడ జరిగిన సంభాషణలో ఇవే ఆఖరి మాటలు! ఆ తర్వాత రష్యా యుద్ధనౌక నిప్పుల వర్షం కురిపించగా, స్నేక్ ఐలాండ్ లో ఉన్న ఉక్రెయిన్ సైనికులు 13 మందీ వీరమరణం పొందారు. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారే కానీ, రష్యాకు మాత్రం లొంగలేదు.

దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోద్మిర్ జెలెన్ స్కీ భావోద్వేగభరితంగా స్పందించారు. స్నేక్ ఐలాండ్ లోని సరిహద్దుల వద్ద మా గార్డులు అందరూ వీరోచిత మరణం పొందారు. ధైర్యంగా మృత్యువును ఆహ్వానించారే తప్ప ఓటమిని మాత్రం అంగీకరించలేదు. వారికి మరణానంతర హీరో ఆఫ్ ఉక్రెయిన్ పురస్కారాలు అందజేస్తాం అని జెలెన్ స్కీ వెల్లడించారు.

కాగా, రష్యా అధికారి, ఉక్రెయిన్ సైనికుల మధ్య జరిగిన సంభాషణ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్యా బలగాలను అడ్డుకోవడానికి బ్రిడ్జిలను కూలుస్తున్న ఉక్రెయిన్ సైన్యం

రష్యా బలగాలు నగరంలోకి చొరబడకుండా ఉక్రెయిన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా సాధ్యపడడం లేదు. చెర్నోబిల్ ఆక్రమణకు వస్తున్న రష్యా బలగాలను అడ్డుకునేందుకు ఇవాంకివ్ లో టెటెరివ్ అనే నదిపై నిర్మించిన బ్రిడ్జిని సైన్యం కూల్చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ధ్రువీకరించారు.

వంతెనలను కూలుస్తున్నా కూడా రష్యా బలగాలకు అడ్డం పడలేకపోతున్నాయి. ఇప్పటికే కీవ్ లోని చాలా ప్రాంతాలను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చెర్నోబిల్ అణు రియాక్టర్ నూ తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఉక్రెయిన్ లోని జమీయిన్యీ దీవిని ఆక్రమించుకున్నాయి. అక్కడున్న 13 మంది ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ ను రష్యా బలగాలు చంపేశాయి.

కాగా, కీవ్ లోని ఒబొలోన్ జిల్లాలో రష్యా యుద్ధ ట్యాంకు ఒకటి సామాన్య పౌరుడి కారును తొక్కించుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. కీవ్ పై రష్యా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వరుస దాడులు జరుగుతుండడంతో రాజధాని నగరంలో నిరంతరాయంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి.

Related posts

వామ్మో టిఫిన్ హోటల్ కు రూ.21 కోట్ల కరెంటు

Drukpadam

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు…

Drukpadam

పేరు మారినా ఆలోచనా విధానం మారలేదు.. ముద్రగడపై కుమార్తె విమర్శ

Ram Narayana

Leave a Comment