- అగ్రస్థానంలో నిలిచిన చైనా
- భారీ బడ్జెట్ ఉన్నా అమెరికాకు రెండో ర్యాంకు
- మూడో స్థానం సంపాదించిన రష్యా
- టాప్ టెన్ లో బ్రిటన్ కు చోటు
ప్రపంచ మేటి సైన్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది అమెరికానే. ఆ దేశం రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ ను చూసినా, ఆ దేశానికి ఉన్న ఆయుధ సంపత్తిని చూసినా అందరికీ అదే అనిపిస్తుంది. కానీ, అగ్రరాజ్యం అమెరికాను తోసిరాజని ప్రపంచ మేటి సైన్యాల జాబితాలో చైనా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మిలటరీ డైరెక్ట్ అనే రక్షణ రంగ వెబ్ సైట్ విడుదల చేసిన ‘అల్టిమేట్ మిలటరీ స్ట్రెంత్ ఇండెక్స్’లో ఈ విషయం తేటతెల్లమైంది. రక్షణ బడ్జెట్, ఆయుధ సంపత్తి, సైనిక బలగం, భూతల–గగన–సముద్ర వనరులు, సగటు వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను విడుదల చేసింది.
100కు 82 పాయింట్లు సాధించిన చైనా జాబితాలో అగ్రస్థానాన్ని సాధించింది. 74 పాయింట్లతో అమెరికా రెండో ర్యాంకు, 69 పాయింట్లతో రష్యా మూడో స్థానం, 61 పాయింట్లతో భారత్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. 43 పాయింట్లు సాధించిన బ్రిటన్ 9వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
విభాగాల వారీగా చూస్తే.. సముద్రంలో చైనా, గగనతలంలో అమెరికా, భూతలంలో రష్యా మొదటి స్థానాల్లో ఉంటాయని నివేదిక పేర్కొంది. గగనతలానికి సంబంధించి అమెరికా వద్ద మొత్తం 14,141 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రష్యాకు 4,682, చైనా వద్ద 3,587 యుద్ధ విమానాలున్నట్టు పేర్కొంది.
అదే భూతల ఆయుధాలకు సంబంధించి రష్యా వద్ద అధునాతనమైన 54,866 వాహనాలు, ఆయుధ సంపత్తి ఉన్నట్టు వెల్లడించింది. అమెరికా వద్ద 50,326, చైనా వద్ద 41,641 యుద్ధ వాహనాలున్నట్టు పేర్కొంది. చైనా వద్ద అత్యధికంగా 406 సముద్ర యుద్ధ నౌకలున్నాయని చెప్పింది. రష్యాకు 278, అమెరికా/భారత్ కు 202 ఉన్నాయని వివరించింది.