వాళ్లు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది: నాదెండ్ల మనోహర్!
-నిన్న భీమ్లా నాయక్ విడుదల
-సీఎం జగన్ సంకుచితంగా ఆలోచిస్తున్నారన్న నాదెండ్ల
-రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల వద్దకు పంపారని ఆరోపణ
-అంతిమంగా ఆత్మగౌరవమే గెలుస్తుందని ఉద్ఘాటన
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్పందించారు. జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం తొలిరోజున ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఏపీ ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల వద్దకు పంపారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.
ప్రజల సమస్యలు తీరుస్తారని నమ్మి అధికారం అప్పగిస్తే ఇలాంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించి ఉండరని పేర్కొన్నారు. భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సంఘటనలు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిందని వివరించారు. పవన్ నటించిన సినిమా విడుదల సందర్భంగా ప్రతి థియేటర్ వద్ద ప్రభుత్వ సిబ్బందిని మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్రచేయడం సిగ్గుచేటు అని నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు.
భీమ్లా నాయక్ చిత్రంలో ఆత్మగౌరవానికి, అహంకారానికి జరిగే పోరాటం ఉందని, అయితే అంతిమంగా గెలిచేది నిలిచేది ఆత్మగౌరవమేనని ఉద్ఘాటించారు. సంకుచిత ధోరణితో, కక్షపూరితంగా నియంతలా వ్యవహరిస్తూ, నేను చెప్పినట్టే మీరు పనిచేయాలనే భావనతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ను పక్కనబెట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు.
“ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆత్మగౌరవంతో ఉన్న మీరు పార్టీ నుంచి బయటికి రండి. మాతో పాటు ప్రయాణం చేయండి. పవన్ కల్యాణ్ నాయకత్వంలో వెళుతూ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ చూపిద్దాం” అని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
ఇక నిన్నటి పరిణామాల నేపథ్యంలో జనసైనికులు ఎక్కడా వైసీపీ నేతల్లా పోలీసుల కాలర్ పట్టుకోలేదని, కానిస్టేబుళ్లపై దురుసుగా ప్రవర్తించలేదని వెల్లడించారు. భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఎన్ని ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనా హుందాగా ప్రవర్తించారని కితాబునిచ్చారు.