బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన!
- సైద్ధాంతికంగా బీజేపీకి కాంగ్రెస్ వ్యతిరేకమే
- అయినా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ సరికాదు
- స్పీకర్ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- స్పీకర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం ఆవిష్కృతం కానుంది. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై స్పందించేందుకు సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీజేపీకి మద్దతుగా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పి కలకలం రేపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సైద్థాంతికంగా భిన్న దారులను ఆశ్రయిస్తున్నా..తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న తీరుతో బీజేపీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధపడినట్టుగా రేవంత్ చెప్పారు.
“బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ సరికాదు. సిద్ధాంతపరంగా బీజేపీకి కాంగ్రెస్ వ్యతిరేకమైనా స్పీకర్ నిర్ణయం సరికాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నాం. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు. స్పీకర్ తీరుకు నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడతాం. దీనిపై రేపు గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేస్తాం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజుననే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, గవర్నర్ ప్రసంగం లేకుండా సభనెలా ప్రారంభిస్తారని సభలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెల్‌లోకి దూసుకువచ్చిన ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లను స్పీకర్ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.