ఉమెన్స్ డే స్పెషల్.. గుర్రంపై మహిళా ఎమ్మెల్యే!
గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి రాక
ఝార్ఖండ్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ వినూత్నత
కూతుళ్లకు మంచి విద్య అందించాలని తల్లిదండ్రులకు పిలుపు
అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాపితంగా వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను గౌరవించుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. అందులో భాగంగా నేడు మనదేశంలోనూ వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినా మహిళలకు సత్కారాలు , సన్మానాలు ఘనంగా జరిగాయి. జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఏకంగా అసెంబ్లీకి గుర్రంపై వచ్చి వినూత్న వరవడి శ్రీకారం చుట్టారు . ఇది దేశ వ్యాపితికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మహిళలకు అవకాశం ఇస్తే మగవాళ్ళకన్నా తీసిపోరని ఆమె పేర్కొనడం విశేషం .
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో సత్తా చాటుతున్న మహిళా మణుల గురించి, మహిళల కోసం ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి.. విధి నిర్వహణలో సత్తా చాటుతున్న మహిళా ఉద్యోగుల గురించి ఎన్నెన్నో చెప్పుకుంటున్నాం కదా. అయితే ఏటా ఇదే చేస్తున్నాం కదా.. అందుకే, ఈ ఏడాది ఏదైనా కొత్తగా చేద్దామని భావించారు ఓ మహిళా ఎమ్మెల్యే. అనుకున్నదే తడవుగా గుర్రం ఎక్కేసి అసెంబ్లీకి పయనమైపోయారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటన ఝార్ఖండ్‌లో మంగళవారం కనిపించింది.
ఝార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్ మంగళవారం గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా తనను పలుకరించిన మీడియాతో ఆమె మాట్లాడుతూ… ప్రతి మహిళలోనూ దుర్గా, జాన్సీరాణీ ఉన్నారన్నారు. ధైర్యంతో మహిళలు ప్రతి సవాల్‌ను ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని, తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విద్యను అందించాలని కోరారు.