- హోలీ వేడుకల్లో యువకుల నోట్లో మద్యం పోసిన ఎమ్మెల్యే
- వైరల్‌గా మారిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీడియో
- అది తాగి అనారోగ్యానికి గురైన యువకుడు
- విచారణ చేపట్టిన ఎక్సైజ్ శాఖ
హోలీ వేడుకల సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదంలో చిక్కుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ యువకులతో కలిసి చిందులేశారు. అక్కడితో ఆగకుండా యువకుల నోళ్లలో మద్యం బాటిల్‌లోని మద్యం ఒంపేశారు. స్వయంగా ఎమ్మెల్యేనే మద్యం పోయడంతో యువకులు కూడా అది రా మద్య(నీళ్లు కలపకుండానే)మైనా ఏమాత్రం అడ్డు చెప్పకుండా తాగేశారు.
అయితే ఈ మద్యం తాగిన యువకుల్లో ఓ యువకుడు అనారోగ్యానికి గురయ్యాడు. అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా… ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. యువకుడికి చికిత్స చేసిన వైద్యులు రా మద్యం తాగిన కారణంగానే అతడు అనారోగ్యానికి గురయ్యాడని తేల్చారు.అంతేకాకుండా స్కాచ్ బాటిల్ లో ఛీప్ లిక్కర్ మద్యాన్ని పోసి తాగించారని కూడా తెలిపారు.
అదే సమయంలో యువకుల నోళ్లలో స్వయంగా ఎమ్మెల్యేనే మద్యం పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఓ వైపు హోలీ వేడుకల్లో మద్యం తాగించడం, మరో వైపు అనారోగ్యానికి గురైన యువకుడి నేపథ్యంలో అబ్కారీ శాఖ ఎమ్మెల్యే తీరుపై విచారణ మొదలెట్టింది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
గతంలో కూడ శంకర్ నాయక్ వివాదాల్లో చిక్కుకున్నారు. అయినప్పటికి అధినేత కేసీఆర్ ఆయనపైనే నమ్మకం ఉంచి టిక్కెట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కూడా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి.