పవన్ తలతిక్కగా మాట్లాడుతూ క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: సీపీఐ నారాయణ!
జనసేన సభలో పవన్ తలతిక్కగా మాట్లాడారు
బీజేపీ, వైసీపీతో జనసేన కలిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు
యువశక్తిని నిర్వీర్యం చేయవద్దని పవన్ కు చెపుతున్నా
మంగళగిరి సమీపంలోని ఇప్పటం వద్ద నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. ఎటూ కాకుండా పవన్ తలతిక్కగా మాట్లాడారని విమర్శించారు. బీజేపీ, వైసీపీ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారి మాదిరి వ్యవహరిస్తున్నాయని… వారితో జనసేన కలిసి ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదని అన్నారు.
అయితే పవన్ తలతిక్కగా మాట్లాడుతూ జనసేన క్యాడర్ ను కూడా కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారని చెప్పారు. పార్టీలోని యువశక్తిని నిర్వీర్యం చేయవద్దని పవన్ కు చెపుతున్నానని అన్నారు. పవన్ అంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని… అయితే ఆయన విధానాలు, నిలకడలేని తనం పట్లే తాము వ్యతిరేకతను తెలియజేస్తున్నామని చెప్పారు.
బీజేపీ ,వైసీపీ ఒకటికదా ? అని నారాయణ ప్రశ్నించారు . వైసిపిని ఓడించేందుకు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేస్తానంటున్న పవన్ కళ్యాణ్ కు బీజేపీ వైఖరి అర్థం అయినట్లు లేదని పేర్కొన్నారు . ఒకపక్క బీజేపీ తో స్నేహం చేస్తూ మరో పక్క వైసీపీతో కత్తి పట్టుకొని యుద్ధం చేస్తానని అంటున్న పవన్ కళ్యాణ్ పై నారాయణ ఒకరేంజ్ లో చురకలు అంటించారు . రాష్ట్రంలో యువతను కన్ఫ్యూజ్ చేసేందుకే పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయని అన్నారు . నిజంగా వైసీపీ వ్యతిరేక స్టాండ్ మీద పవన్ ఉంటె బీజేపీతో ఉన్న పొత్తుపై ఆలోచన చేసుకొని ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు . అయితే పవన్ వెంట పరుగులు తీసే వారందరు ఓట్ల రూపంలో ఉపయోగపడతారు లేదా ? అనేది ఇప్పటికి సందేహంగానే ఉంది.గత ఎన్నికల్లో పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు నియోజవర్గాలలో ఓడిపోయడం ఆయన తన వెంట వచ్చేవారిని ఓట్ల రూపంలో మలుచుకోలేకపోతున్నారని పరిశీలకుల అభిప్రాయం