చిన్నజీయర్ స్వామితో నాకు విభేదాలున్నాయని ఊహించుకోవద్దు: సీఎం కేసీఆర్!
-సహస్త్రాబ్ది వేడుకలకు దూరంగా కేసీఆర్!
-మోదీ తదితర బీజేపీ నేతలపై చిన్నజీయర్ పొగడ్తల జల్లు
-జీయర్ తో కేసీఆర్ కు ఎడం పెరిగిందని ప్రచారం
-ఎవరు చెప్పారంటూ మీడియాను ప్రశ్నించిన కేసీఆర్
ఎప్పుడో 20 ఏళ్ల కిందట చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల చిన్నజీయర్ స్వామిపై తెలంగాణ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ విషయం అటుంచితే… ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు, చిన్నజీయర్ స్వామికి మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని వచ్చినప్పటికీ సీఎం రాకపోవడంతో చిన్నజియ్యరుతో ఎక్కడో చెడిందని అందువల్లనే సీఎం కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది.
ఇటీవల ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగిన సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఆ ఎపిసోడ్ ముగిసిన కొన్నిరోజులకే సమ్మక్క-సారలమ్మలపై జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెరపైకి రావడంతో ఆయనపై విమర్శల జడివాన కురిసింది. దాంతో ఊహాగానాలు మరింత బలంగా వినిపించాయి.
ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ స్పందించారు. చిన్నజీయర్ స్వామితో తనకు విభేదాలున్నాయని ఎవరూ ఊహించుకోవద్దని అన్నారు. అసలు తమ మధ్య విభేదాలున్నాయని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. చిన్నజీయర్ స్వామికి, తనకు మధ్య అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దని హితవు పలికారు. ఇద్దరి మధ్య ఎడం ఉందని ఎవరికి వారే ఊహించుకుంటే ఎలా? అని అసహనం వెలిబుచ్చారు. ఈ అంశంపై స్పందించాల్సిన అవసరమేలేదన్నారు.