ఉచితాలను ఆపకపోతే.. ప్రతి రాష్ట్రం ఓ శ్రీలంకే: జేపీ వార్నింగ్
- న్యూస్ ఛానెల్ డిబేట్లో పాల్గొన్న జేపీ
- రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై లోతైన విశ్లేషణ
- ఉత్పాదకతను మరిచి ఉచితాల బాట పడితే నష్టమని వార్నింగ్
ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న ఉచిత పథకాలను ఇంకా కొనసాగిస్తే.. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రం ఓ శ్రీలంకలా మారిపోవడం ఖాయమేనని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ హెచ్చరించారు. శ్రీలంకలో దాపురించిన దుస్థితి, ఉక్రెయిన్-రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి.. అందులో ప్రత్యేకించి భారత ఆర్థిక పరిస్థితి ఏమిటన్న దానిపై ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఎఫ్ఆర్‌బీఎం పరిధిని దాటేసి అప్పులు చేసేశాయని చెప్పిన జేపీ.. ఉత్పాదకత లేకుండా వచ్చిన బోటాబొటి ఆదాయాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేయడం సరికాదని సూచించారు. ఈ క్రమంలో ఆయన పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని వివరించారు. అదే సమయంలో 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎలాగైతే ఎఫ్ఆర్‌బీఎంను తీసుకొచ్చామో.. ఇప్పుడు కూడా అలాంటి ఓ కట్టుదిట్టమైన కట్టుబాటును ఏర్పాటు చేయకపోతే.. ఉచితాలకు అడ్డుకట్ట వేయలేమని జేపీ చెప్పుకొచ్చారు.