Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బహ్రెయిన్ లో బురఖా ధరించిన మహిళకు ప్రవేశం నిరాకరించిన ఇండియన్ రెస్టారెంటు మూసివేత

  • 1987 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెస్టారెంటు
  • బురఖా ధరించిన మహిళను అడ్డుకున్న డ్యూటీ మేనేజర్
  • వీడియో వైరల్
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బహ్రెయిన్ ప్రభుత్వం
  • మేనేజర్ ను తొలగించిన రెస్టారెంటు యాజమాన్యం

బహ్రెయిన్ ప్రధానంగా ముస్లిం మెజారిటీ దేశమని తెలిసిందే. ఇక్కడ ఇస్లాంను అనుసరించి సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. అయితే, ఇక్కడి అద్లియా ప్రాంతంలోని ఓ భారత రెస్టారెంటుపై బహ్రెయిన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. బురఖా ధరించిన ఓ మహిళకు రెస్టారెంటులో ప్రవేశం నిరాకరించడమే అందుకు కారణం. ఈ మేరకు ఆరోపణలు రావడంతో, దీనిపై విచారణకు ఆదేశించిన బహ్రెయిన్ సర్కారు… ఆ ఇండియన్ రెస్టారెంటును మూసివేయాలని హుకుం జారీచేసింది. 

సదరు రెస్టారెంటు బహ్రెయిన్ లో 1987 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా,రెస్టారెంటు సిబ్బంది బురఖా ధరించిన ఓ మహిళను అడ్డుకోవడం ఓ వీడియోలో దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం పట్ల బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణకు తెరదీసింది. దేశంలోని అన్ని పర్యాటక కేంద్రాలు తమ ప్రభుత్వ నియమనిబంధనలు పాటించాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను విడనాడాలని స్పష్టం చేసింది. ప్రజల పట్ల వివక్ష చూపించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఉద్ఘాటించింది. 

బహ్రెయిన్ ప్రభుత్వ ఆగ్రహానికి గురైన సదరు భారతీయ రెస్టారెంటు క్షమాపణలు తెలిపింది. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్టు ఇన్ స్టాగ్రామ్ లో ఓ ప్రకటన చేసింది. ఈ సమయంలో విధుల్లో ఉన్న డ్యూటీ మేనేజర్ ను సస్పెండ్ చేసినట్టు రెస్టారెంటు యాజమాన్యం వెల్లడించింది. 

35 ఏళ్లకు పైగా తాము బహ్రెయిన్ లో సేవలు అందిస్తున్నామని, తమ రెస్టారెంటు అందిరిదీ అని, ఇక్కడికి ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో వచ్చి సొంత ఇంటి వాతావరణాన్ని ఆస్వాదించేలా ఉంటుందని పేర్కొంది. డ్యూటీ మేనేజర్ తప్పిదం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని, ఈ ఘటనతో తాము ఏకీభవించడంలేదని రెస్టారెంటు యాజమాన్యం వెల్లడించింది.

Related posts

తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు!

Drukpadam

తెలంగాణపై కక్షతోనే కేంద్రం సహకరించడంలేదు: నామా నాగేశ్వరరావు

Drukpadam

పంటనష్టం ఎకరాకు 20 వేలు ఇవ్వాలి…సీఎం కేసీఆర్ కు తమ్మినేని వినతి

Drukpadam

Leave a Comment