రాహుల్, రేవంత్‌లపై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!
- రాహుల్ నాన్సెన్స్, రేవంత్ న్యూసెన్స్
- రాహుల్, రేవంత్ ఇద్దరూ ఐరెన్ లెగ్గులే
- గాంధీ భవన్‌ను రేవంత్ కుస్తీ భవన్‌గా మార్చారన్న జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ (పీయూసీ) చైర్మన్ జీవన్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు సంధించారు. రాహుల్ గాంధీ ఓ నాన్సెన్స్ అయితే, రేవంత్ రెడ్డి ఓ న్యూసెన్స్ అంటూ ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో రైతుల సమస్యలపై రాహుల్ గాంధీ మంగళవారం తెలుగులో ఓ ట్వీట్ సంధించిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌పై టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో జీవన్ రెడ్డి కూడా తన వంతు పాత్రను అందుకున్నారు. రాహుల్‌తో పాటు రేవంత్‌పైనా ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
సీఎం కేసీఆర్‌ను వార్ హీరోగా అభివర్ణించిన జీవన్ రెడ్డి.. తెలంగాణ కోసం తాము రాజీనామా చేశామని గుర్తు చేశారు. అదే విధంగా రైతుల కోసం కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి రైతులు, ప్రజలపై ప్రేమ లేదన్న జీవన్‌రెడ్డి.. దేశంలో రాహుల్ ఓ ఐరెన్ లెగ్ అన్నారు.
పంజాబ్‌లో రాహుల్ అడుగుపెట్టగానే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఓ ఐరెన్ లెగ్గేనని చెప్పిన జీవన్.. రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు అందిన తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు 4 వేల ఓట్లు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌ను కుస్తీ భవన్‌గా మార్చేశారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.