స్వాతంత్య్ర పోరు స్ఫూర్తితో దేశాభివృద్ధికి పునరంకితవ్వాలి
టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు
న్యూఢిల్లీః
పరాయిపాలనపై మహోన్నతంగా జరిగిన భారతదేశ స్వాతంత్య్ర పోరు స్ఫూర్తితో దేశాభివృద్ధికి భారత ప్రజానీకమంతా పునరంకితవ్వాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదికాఅమృతమహోత్సవ్‌లో భాగంగా, పార్లమెంట్ హౌస్‌లోని లైబ్రరీ భవనంలో “భారత స్వాతంత్య్ర పోరాటం” ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ఓంబిర్లాతో పాటు లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర పోరాటం ప్రపంచంలోనే సాటిలేనిదని వ్యాఖ్యానించారు. విప్లవకారులు, రైతులు, గిరిజనులు, యువత, మహిళలు, సామాన్య ప్రజలు భరించలేని బాధను అనుభవించారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారంతా లెక్కలేనన్ని త్యాగాలు చేశారని చెప్పారు. అప్పుడు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఇందుకు సహకరించారని తెలిపారు. ఆ మహత్తర పోరాటాన్ని ఈ సోమవారం లోక్‌సభలోని లైబ్రరీ బిల్డింగ్‌లో జరిపిన ఎగ్జిబిషన్ గుర్తు చేస్తుందని చెప్పారు. 1757 నుంచి 1947 మధ్య జరిగిన ఈ చరిత్ర మనకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. ఆనాటి ప్రజలు స్వాతంత్య్రం కోసం ఏ సంకల్పంతో తమను తాము అంకితం చేసుకున్నారో, అదే సంకల్పంతో మనం కూడా దేశ నవ నిర్మాణానికి మనల్ని మనం అంకితం చేసుకోవడం ద్వారా ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్- స్వావలంబన భారత్ అనే భావనను సాకారం చేసుకోవాలని సూచించారు.