కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఫైర్…
–ఏడాదిగా చెబుతన్నాం… కేంద్రం తెలంగాణ రైతాంగంపై పగ పట్టిందని!
–ఇప్పుడు బీజేపీ సర్కారు చర్యలతోనే ప్రజానీకం తెలుసుకుంటున్నవైనం
–ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్‌కు లోక్‌సభలో ప్రివిలేజ్ నోటీసులు
–పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్
న్యూఢిల్లీ
భారతదేశ చరిత్రలో పార్లమెంట్‌లో ఇంతస్థాయిలో రైతుల గురించి లేవనెత్తి పోరాడిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్ తప్ప మరొకటి లేదని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణపై మనసు ఉంటే కేంద్రానికి మార్గం కనిపిస్తుందని, అయితే కేంద్రానికి రాష్ట్రంపై మనసు లేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా కాపాడుకోవాలో తమ నాయకుడు కేసీఆర్‌కు తెలుసు అంటూ ఎంపీ నామ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దిశానిర్దేశం మేరకు రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటును, దేశ ప్రజలని, రైతులను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర వాణిజ్య, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పై సభా హక్కుల ఉల్లంఘన(ప్రివిలేజ్ మోషన్) నోటీసును సోమరవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి పాటిల్,మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్ నేత, రాములు అందజేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై లోక్‌సభ లోపల వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బచావో బచావో…కిసాన్ కో బచావో…. వి వాంట్ జస్టిస్… వి వాంట్ జస్టిస్…. కొనాలి కొనాలి తెలంగాణ రైతుల ధాన్యం కొనాలి అంటూ పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్ ఎంపీల నినాదాలతో లోక్‌సభ మారుమోగుపోయింది.
అటుతర్వాత లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేసి, తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి మనసు లేదని గత సంవత్సర కాలంగా తాము చెబుతున్న విషయాలు ప్రస్తుతం నిజం అయ్యాయని ఎంపీ నామ నాగేశ్వర్‌వరావు చెప్పారు. తెలంగాణ రైతులను కేంద్రం పగ బట్టిందని వాపోయారు. ఇక్కడొక మాట… పార్లమెంట్‌లో ఒక మాట… రాష్ట్రంలో ఒక మాట చెబుతూ తెలంగాణ ప్రజలను కేంద్రం, బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వెల్లడించారు. రైస్ ఎగుమతి అవుతుందా? అంటే… అన్నిరకాల రైస్ ఎగుమతి చేస్తున్నదని సమాధానం ఇస్తున్నారని వివరించారు. మరి మా తెలంగాణ రైస్ ఎందుకు ఎగుమతి కాదంటే… సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఎటువంటి ఎగుమతికి అయినా పర్మిషన్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి రైస్ అవసరం ఉంటే పంపించే అవకాశం ఇవ్వవచ్చని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో అన్ని ప్రయత్నాలు చేశామని, కానీ వారు తమ మీద పగబట్టడం తప్ప మరేమి కనిపించడం లేదన్నారు. డబ్ల్యూటీఓ ఉన్నప్పటికీ ధాన్యం కొనాల్సిన కనీస బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కదా? అని అన్నారు. ఎంఎస్పీ ప్రకారం కొంటామని పార్లమెంట్ లో స్పష్టం చేసిన పీయూష్ గోయల్… ప్రస్తుతం మాట మారుస్తున్నారని వివరించారు. రైతులను ఇబ్బంది పెట్టడానికే ఈ చర్యలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు లేని నిబంధనలు తెలంగాణకు వచ్చేసరికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు గుర్తు వస్తున్నాయా? అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కిషన్‌రెడ్డి తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రవర్తించడం లేదని వ్యాఖ్యానించారు. మాటలతో రైతాంగాన్ని మోసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎంపీలు తయారు అయ్యారని అర్థ అవుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు.