ఏపీ లో మొత్తం 24 మంది మంత్రుల రాజీనామా …తిరిగి వచ్చేది ఎవరు ?
ఆ ఐదారుగురు ఎవరు?… ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్
ఐదారుగురికి ఛాన్సే దక్కొచ్చన్న కొడాలి నాని
వారెవరన్నది తనకు తెలియదని వ్యాఖ్య
కొత్త కేబినెట్‌లోకి పాత మంత్రులెవరన్న దానిపై చర్చ
ఏపీలో 24 మంత్రులు రాజీనామా చేసిన అనంతరం పాత వారిలో ఐదారుగురు తిరిగి మంత్రులుగా ఉంటారని చెప్పటం తో ఇప్పుడు ఆ ఐదారుగురు ఎవరు ? అనే అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీ కేబినెట్‌లో మొత్తం 24 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు . సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రులంతా తమ రాజీనామా లేఖలను ఆయనకే అందజేశారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా జగన్ మంత్రులకు వివరించారు.
ఈ క్రమంలో కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మంత్రి కొడాలి నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదుగురో, ఆరుగురో తిరిగి కొత్త మంత్రివర్గంలో పనిచేసే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పనితీరులో సత్తా కనబరచిన వారో, అనుభవమున్న సీనియర్లో, లేదంటే సామాజిక వర్గ సమీకరణాలో తెలియదు గానీ… ఇప్పుడు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదారుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నట్లు ఆయన చెప్పారు.
కొడాలి నాని వ్యాఖ్యలతో ఏపీలో ఒక్కసారిగా ఓ పెద్ద చర్చకు తెర లేచింది. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కే ఐదారుగురు పాత మంత్రులు ఎవరంటూ ఎవరికి తోచిన లెక్కలతో వారు అంచనాలేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక వర్గ సమీకరణాలను ప్రధానంగా ముందేసుకుని మరీ కొందరు లోతైన చర్చల్లోకి మునిగిపోయారు. అయితే ఆ ఐదారుగురు ఎవరన్న విషయం మాత్రం జగన్ ప్రకటించే దాకా ఏ ఒక్కరికీ తెలియదనే చెప్పాలి. ఈ తరహా వ్యవహారాల్లో చాలా సీక్రెసీని మెయింటైన్ చేస్తున్న జగన్.. చివరి నిమిషం దాకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపై మీరంతా పార్టీ బాధ్యతల్లోకి వెళతారు: రాజీనామా చేసిన మంత్రులతో సీఎం జగన్
మంత్రులతో చివరి క్యాబినెట్ భేటీ నిర్వహించిన సీఎం జగన్ రాజీనామా చేసిన వారికి దిశానిర్దేశం చేశారు. “మీ అందరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తొలివిడత అవకాశం ఇచ్చాం. ఇకపై మీరందరూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతల్లోకి వెళతారు. మీకున్న అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించండి. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం” అని వెల్లడించారు.
పదవులతో పాటు కాన్వాయ్‌లనూ వదిలేసిన ఏపీ మంత్రులు
ఏపీ కేబినెట్‌లో మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన 24 మంది వైసీపీ ఎమ్మెల్యేలు… ఇంటికి వెళ్లే సందర్భంగా తమకు ప్రభుత్వం కేటాయించిన కాన్వాయ్‌లను కూడా వదిలేసి బయలుదేరారు. ఈ మేరకు కాసేపటి క్రితం అమరావతి పరిధిలోని ఏపీ సచివాలయంలో కీలక సన్నివేశం కనిపించింది.
గురువారం మధ్యాహ్నం. మొదలైన కేబినెట్ భేటీలో సీఎం జగన్ ఆదేశించిన మరుక్షణమే కేబినెట్‌లోని 24 మంది తమ పదవులకు రాజీనామాలు చేసి లేఖలను వారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించారు. ఆ తర్వాత కేబినెట్ భేటీ ముగియగా.. బయటకు వచ్చిన మంత్రులు..మంత్రి హోదాలో ప్రభుత్వం తమకు కేటాయించిన కాన్వాయ్ లను అక్కడే వదిలేసి సొంత వాహనాల్లో ఇళ్లకు వెళ్లిపోయారు. కేబినెట్ భేటీకి ముందే మంత్రులంతా తమ చాంబర్లను ఖాళీ చేసినట్టు సమాచారం.
కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవు: గుడివాడ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ఏపీ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) కీలక వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని, తాను కూడా అందరి మాదిరిగానే మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో కొందరికి స్థానం ఉంటుందని చెప్పిన నానికి మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది.
ఈ సందర్భంగా కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో స్థానముంటుందా? అన్న ప్రశ్నకు స్పందించిన నాని… కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని వ్యాఖ్యానించారు. కొత్త కేబినెట్‌లో తనకు స్థానంపై అవకాశాలు తక్కువేనని ఆయన చెప్పారు. కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేరకు మంత్రివర్గంలోని అందరం రాజీనామా చేశామని చెప్పారు.
ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ చెప్పారన్నారు. మంత్రి పదవులకు తాము రాజీనామా చేస్తుంటే.. జగన్ ఎక్కువగా బాధపడినట్టుగా కనిపించిందని, అయితే తాము ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని, మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని నాని వ్యాఖ్యానించారు.