వడ్ల వార్ …కేంద్రం వడ్లు కొనేదాకా వదిలి పెట్టం :మంత్రి పువ్వాడ
-రైతుపై కక్ష.. కొనుగోళ్లలో వివక్ష!!
-మొండి మాటల బండీ.. ఎక్కడున్నవు?
-ఖమ్మం లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
-కేంద్రంపై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం
వడ్ల వార్ …కేంద్రం తెలంగాణ రైతుల వడ్లు కొనేదాకా వదిలిపెట్టమని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు . కేసీఆర్ ప్రభుత్వం రైతులకోసం రైతుల పక్షాన పోరాడేందుకు ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు . తెలంగాణ రైతులపై కక్ష గట్టి వడ్లు కొనకుండా వివక్షత చూపుతుందని రైతులపై కక్ష కట్టిన ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో లేవని మంత్రి హెచ్చరించారు .శుక్రవారం కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనగా నల్ల జెండాలతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలుపై పూటకో మాట మాట్లాడుతూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు. రైతు వ్యతిరేకి బీజేపీని ప్రజలు సహించబోరని మంత్రి అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారా బాయిల్డ్ రైస్ పేరిట కొర్రీలు పెడుతూ రైతుల జీవితాలతో ఆటలాడుతున్న మోదీ సర్కారుకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారే వరకు పోరాటం ఆపబోమన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు జిమ్మిక్కులు చేస్తున్నారని, మొండి మాటలతో తెలంగాణ రైతులను మాయచేస్తున్న బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించాలని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్న బీజేపీకి పతనం తప్పదన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయకుండా రైతుల సహనాన్ని పరీక్షిస్తుందన్నారు.
తెలంగాణలో ఉద్యమాలు కొత్త కాదని, తిరగబడితే సాధించలేనిది ఏదీ లేదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొత్త నిబంధనలు పెట్టి రైతులపై షరతులు విధించవద్దని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దనే వ్యవసాయ చట్టాలు ఉన్నాయని, ఎమ్మెస్పీ చేసే బాధ్యత కూడా కేంద్రానిదేనని, తాము రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ద్వారా వచ్చే హక్కు ప్రకారంగానే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 11 ఢిల్లీలో దద్దరిల్లేలా దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో పంటలు బ్రహ్మాండంగా పండుతుంటే బీజేపీ నాయకులకు మింగుడుపడడం లేదన్నారు. పంజాబ్‌లో ఎట్ల కొంటారు ? తెలంగాణలో ఎందుకు కొనరు ? అని ఆయన నిలదీశారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను మించి తెలంగాణ దిగుబడి సాధిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆందోళన చేస్తామని, మెడలు వంచి వడ్లు కొనుగోలు చేయిస్తామన్నారు. రాష్ట్రంలోని బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు రోడ్లపై వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు