మంత్రి పదవిని ఆశించడంలో తప్పులేదుగా!: తమ్మినేని సీతారాం!
- ఏపీలో కొత్త మంత్రివర్గం
- సీఎం జగన్ కు విధేయత ప్రకటించిన స్పీకర్ తమ్మినేని
- సీఎం మానవతావాది అని కితాబు
- సామాజిక న్యాయం జరిగిందని వెల్లడి
ఏపీలో నూతన క్యాబినెట్ రంగప్రవేశం చేసిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన మాట్లాడుతూ, నువ్వు గెలవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పాదయాత్ర సమయంలో అన్నారని, ఆయన అన్నట్టుగానే గెలిచివచ్చానని తెలిపారు. మంత్రి పదవిని ఆశించడంలో తప్పులేదని సమర్థించుకున్నారు.
అయితే సీఎం జగన్ కు తానెప్పుడూ సమస్య కాదలుచుకోలేదని తమ్మినేని స్పష్టం చేశారు. గతంలో కూడా స్పీకర్ గా ఉండాలంటూ సీఎం జగన్ కొంత ఇబ్బంది పడుతూనే చెప్పారని, అయితే, తనకేమీ సమస్య లేదని తానే బాధ్యతగా ముందుకువచ్చి స్పీకర్ పదవిని చేపట్టానని వివరించారు. జగన్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధమేనని ఉద్ఘాటించారు.
క్యాబినెట్ కూర్పులో సీఎంకు కొన్ని సమీకరణాలు ఉంటాయని, పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. సీఎం జగన్ పెద్ద మానవతావాది అని, కొత్త మంత్రివర్గంలో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారని కొనియాడారు. రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం జరిగిందని పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు లభించాయని అన్నారు. ఎక్కడైనా గానీ క్యాబినెట్ కూర్పు ఏమంత సులువైన విషయం కాదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీసీలు టీడీపీకి ఎప్పుడో దూరమయ్యారని, అయితే సీఎం జగన్ దామాషా లెక్కన బీసీలకు రాజ్యాధికారం అప్పగించి తన నిబద్ధతను చాటుకున్నారని తమ్మినేని కొనియాడారు.