వైసీపీలో జిల్లాల రచ్చ.. కోనసీమ జిల్లాలో ఎంపీటీసీ సహా 38 మంది రాజీనామా!
- కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్
- డిమాండ్ నెరవేరకపోవడంతోనే రాజీనామాలు
- ప్రతి దళిత పేటలోనూ రాజీనామాలు చేయిస్తామన్న దుర్గాప్రసాద్
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నెలకొన్న అసంతృప్తులను పార్టీ అధిష్ఠానం ఎలాగోలా సద్దుమణిగేలా చేసిన మరుక్షణమే… కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల నేపథ్యంలో నెలకొన్న అసంతృప్తులు రచ్చకెక్కేలా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోలేదన్న నెపంతో పార్టీకి కొందరు రాజీనామాలు చేశారు.
రాజీనామాల్లో భాగంగా కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన ఎంపీటీసీ నెల్లి దుర్గా ప్రసాద్ సహా 38 మంది నేతలు పార్టీకి రాజీనామాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నెల్లి దుర్గాప్రసాద్… కోనసీమ జల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని జిల్లావ్యాప్తంగా పార్టీకిపెద్ద ఎత్తున వినతులు వెళ్లాయన్నారు. అయితే తమ ప్రతిపాదనకు పార్టీ గౌరవం ఇవ్వని కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని దళిత పేటల్లో వరుసగా పార్టీ శ్రేణులతో రాజీనామాలు చేయిస్తామని ఆయన తెలిపారు.