నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో చేసింది: ఏపీ మంత్రి కాకాణి!
-మంత్రి అనేది పదవి కాదు.. బాధ్యతన్న కాకాణి
-ఎంతో మంది ఆశీర్వాదాలతో ఈ స్థాయికి వచ్చానని వ్యాఖ్య
-ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తుంచుకుంటానన్న మంత్రి
మంత్రి అనేది పదవి కాదని, ఒక బాధ్యత అని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంత్రిగా రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో అందరికీ అందుబాటులో ఉంటూ, అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని చెప్పారు. రైతుల జీవితంలో వెలుగులు నింపడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
ఎంతో మంది ఆశీర్వాదాలతోనే మంత్రి స్థాయికి వచ్చానని… ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తుంచుకుంటానని కాకాణి అన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో సహకరించిందని చెప్పారు. మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు.
ధాన్యం కొనుగోళ్ల కోసం జగన్ రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయం చేసి, రైతులకు మేలు కలిగేలా చేస్తామని అన్నారు. రైతులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరులో ఘనస్వాగతం
అంతకుముందు కాకాని ర్యాలీగా నెల్లూరు చేరుకున్నారు .నెల్లూరు లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. మాజీమంత్రి అనికుమార్ యాదవ్ సభ కూడా ఎలాంటి అంటకాలు లేకుండా ఎవరిని విమర్శించకుండా సాగడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
నెల్లూరు రాజకీయాల్లో ఇవాళ అందరి దృష్టి మాజీ మంత్రి అనిల్ కుమార్ సభ, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బైక్ ర్యాలీపైనే కేంద్రీకృతమై ఉంది. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో అనిల్ సభ ఎలాంటి వివాదాలకు తావులేకుండా జరగ్గా, అటు, మంత్రి అయిన తర్వాత కాకాణి తొలిసారిగా నెల్లూరు విచ్చేశారు. కావలి నుంచి ఆయన ర్యాలీ నెల్లూరుకు చేరుకోగానే పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆర్యవైశ్య నేతలు, వైసీపీ శ్రేణులు కాకాణికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకాణి ఆత్మకూరు బస్టాండు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నెల్లూరు వైసీపీ కార్యాలయానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు.
అంతకుముందు, అమరావతి నుంచి కావలి విచ్చేసిన ఆయనకు పట్టణ శివార్లలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కార్యకర్తలు స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ కావలి పట్టణంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాకాణి… ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అనంతరం నెల్లూరు పయనమయ్యారు.