సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ… తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్!
-ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య
-టీఆర్ఎస్, పోలీసుల వేధింపులే కారణమంటున్న బీజేపీ
-ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్
ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. బీజేపీ తెలంగాణ శాఖ నేతలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అధికార టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆత్మహత్యకు ముందు కూడా సాయి గణేశ్ ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారని కూడా బీజేపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయి గణేశ్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకే తెలంగాణ బీజేపీ నేతలు సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై ఖమ్మం లో రోజు ఎదో ఒక ఆందోళన జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు . సాయి గణేష్ కుటుంబసభ్యులతో కూడా నేరుగా ఫోన్ లో మాట్లాడారు . కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు . కేంద్ర మంత్రి చంద్రశేఖర్ , ఆదిలాబాద్ ఎంపీ బాబురావు , మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , తమిళనాడు బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు . కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం రానున్నారు . ఈ నేపథ్యంలో బీజేపీ ఈ కేసును చాల సీరియస్ గా తీసుకుంది. సాయి గణేష్ ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయ్ , కార్పొరేటర్ భర్త ప్రసన్నలు కారణమని వారిపై కేసు నమోదు చేయాలనే డిమాండ్ బీజేపీ చేస్తుంది. దీనిలో భాగంగానే సిబిఐ విచారణ జరపాలని హైకోర్టు ను బీజేపీ ఆశ్రయించింది.