- శని, ఆదివారాల్లో బిజీగా గడిపిన లగడపాటి
- పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులతో సమావేశం
- రాజకీయాల్లోకి వస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏది చేసినా సెన్సేషన్ గానే ఉంటుంది. గత 8 సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి ఎన్టీఆర్ జిల్లాపర్యటనలో రెండు రోజులు గడపటం రాజకీయ ప్రముఖులను కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో పర్యటించి పలువురు రాజకీయ నాయకులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. దీంతో తిరిగి ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌తోపాటు వైసీపీ, కాంగ్రెస్ నేతలతోనూ లగడపాటి సమావేశమయ్యారు. శనివారం రాత్రి చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, ఎమ్మెల్యే వసంత హాజరయ్యారు. ఆ రాత్రి నందిగామలోని స్థానిక మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాలేటి సతీష్ ఇంట్లో బసచేశారు.
నిన్న నందిగామ, జగయ్యపేట నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, వైసీపీ నాయకులను లగడపాటి కలుసుకున్నారు. అలాగే, ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుడు మంగూలరి కోటిరెడ్డి చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును కలిశారు. రాజకీయ నాయకులతో వరుస సమావేశాల నేపథ్యంలో లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇదే విషయాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని లగడపాటి తేల్చి చెప్పారు.