Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ.. ‘బీఆర్ఎస్’గా టీఆర్ఎస్.. ప్లీనరీలో కేసీఆర్

  • టీఆర్ఎస్ కు రూ.వెయ్యి కోట్లకుపైగా ఆస్తులున్నాయన్న తెలంగాణ సీఎం
  • అన్ని విషయాల్లో రాష్ట్రమే నెంబర్ వన్ అంటూ కామెంట్
  • దేశం గతి, స్థితిని మార్చేందుకు హైదరాబాద్ వేదికవ్వాలని పిలుపు
  • దేశంలో కొత్త రాజకీయ శక్తి వస్తుందని వెల్లడి
  • గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు

60 లక్షల మంది సభ్యులు, రూ.వెయ్యి కోట్లకుపైగా ఆస్తులు కలిగి ఉన్న రాజకీయ సంస్థగా టీఆర్ఎస్ ఎదిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను అనుక్షణం కాపాడే కాపలాదారు పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఈ పార్టీ తెలంగాణకు పెట్టని కోట అని, ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచు కోట అని అన్నారు. పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని చెప్పారు. 

తెలంగాణకు ఏ పార్టీ లేని సమయంలో ఉవ్వెత్తున గులాబీ జెండా ఎగిసిందని, ఎన్నెన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఎదిగిందని అన్నారు. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చాక దేశానికే ఓ రోల్ మోడల్ గా రాష్ట్రం నిలిచిందన్నారు. తెలంగాణ రోల్ మోడల్ అనడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డులే తార్కాణమన్నారు. రాష్ట్రానికి అవార్డు, రివార్డులు రాని డిపార్ట్ మెంట్లే లేవని చెప్పుకొచ్చారు. నిన్న కేంద్రం అందించిన సంసద్ ఆదర్శ గ్రామాల్లో టాప్ టెన్ తెలంగాణ నుంచే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 

ఒకప్పుడు కరవుకాటకాలతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు జల భాండాగారంగా రూపుదిద్దుకోబోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లిస్తున్నామని, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తే పసిడి పంటలు పండుతాయన్నారు. దేశంలో కరెంటు కోతలున్నా.. మన దగ్గర మాత్రం 24 గంటల విద్యుత్ ను ఇస్తున్నామని, అదే రాష్ట్ర పనితీరుకు నిదర్శనమని చెప్పారు. 

ఒకప్పుడు మంత్రివర్గం నుంచి ఎవరైనా మంత్రిని తొలగిస్తే ‘వికెట్ నెంబర్ 1 డౌన్’ అంటూ పేపర్లలో వార్తలు వచ్చేవని, అయితే, ఇప్పుడు తెలంగాణ మంత్రి వర్గంలో అలాంటి వికెట్లేవీ లేవని కేసీఆర్ అన్నారు. ధరణి పోర్టల్ గురించి దేశమంతా మాట్లాడుకుంటోందని, పారదర్శకంగా భూలావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన తలసరి ఆదాయాన్ని మనమే రెట్టింపు చేసుకున్నామని చెప్పారు. 

చాలా విషయాల్లో తెలంగాణే నెంబర్ వన్

అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్ అని కేసీఆర్ అన్నారు. విద్యుత్ వాడకం, ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వడం సహా అన్నింట్లో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. తెలంగాణలో 2014 నాటికి రూ.5 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర ఆదాయం.. ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 

జాతీయ రాజకీయాల గురించీ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. టీఆర్ఎస్ పనిచేసే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదని, ఒకవేళ అలా పని చేసి ఉంటే దేశ జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లుగా ఉండేదన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో అభివృద్ధి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు లభించలేదన్నారు. 

ఇటీవలి కాలంలో దేశంలో అవాంఛిత అనారోగ్యకరమైన పెడధోరణులు, విపరీత జాడ్యాలూ రాజ్యమేలుతున్నాయని చెప్పారు. అది భారత సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. భారత సమాజం సహనం, శాంతి, సామరస్యానికి ఆలవాలమన్నారు. 

కానీ, కొన్ని పెడధోరణులు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయని, దేశ గరిమకు గొడ్డలిపెట్టులా మారాయని అన్నారు. వాటన్నింటికీ చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 

మణిదీపంలా తెలంగాణ

దేశంలో స్థాపిత విద్యుచ్ఛక్తి 4,01,035 మెగావాట్లు అందుబాటులో ఉందని, దేశంలో తలసరి వినియోగం ఎక్కువని కేసీఆర్ చెప్పారు. అందుబాటులో ఉన్నా కూడా ఆ విద్యుత్ ను వినియోగించుకోలేని అశక్త పరిస్థితుల్లో భారత్ ఉందన్నారు. రోజుకు దాంట్లో సగం కూడా వాడుకోవడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహించే గుజరాత్ లో కూడా కరెంట్ కోతలు దారుణంగా ఉన్నాయని, ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. మన రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ ప్రకటిత, అప్రకటిత కోతలున్నాయన్నారు. 

చుట్టూ రాష్ట్రాల్లో కోతలతో చీకట్లుంటే.. మధ్యలో తెలంగాణ మాత్రం మణిదీపంలా వెలిగిపోతోందని చెప్పుకొనేందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం పనిచేయకపోవడం వల్లే చీకట్లు అలముకుంటున్నాయని, ఉన్న విద్యుత్ ను వాడుకుంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోతల్లేకుండా విద్యుత్ ను అందించొచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ చీకట్లలో మగ్గడం భారతీయులకు ప్రాప్తా? అని ప్రశ్నించారు. 

దేశంలో కనీసం తాగునీరు, సాగునీరు, కరెంట్ లేవని, ఉపన్యాసాలు వింటే మాత్రం మైకులు పగిలిపోతాయని  అన్నారు. ఉండి కూడా వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో దేశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. వీటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. కాబట్టి దేశ రాజకీయాల్లో తెలంగాణ తన వంతు పాత్ర పోషించాలని, ఆ దిశగా ముందుకెళ్లాలని జాతీయ రాజకీయాల గురించి మనసులో మాటను కేసీఆర్ బయట పెట్టారు. 

‘బీఆర్ఎస్’ చేయాలంటున్నారు

దేశంలో బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నాయని, అయితే, తననూ వారిలో చేరాల్సిందిగా కోరారని, తాను రానని తేల్చి చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు. ఎవరినో గద్దె దించేందుకు తాను పనిచేయనని చెప్పానన్నారు. గద్దెనెక్కించాల్సింది దేశ ప్రజలనని, పార్టీలను కాదని పేర్కొన్నారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదని, ప్రజల జీవితాలని అన్నారు. ప్రజలే ఎజెండాగా ఫ్రంట్లు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదని, ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా అని కేసీఆర్ అన్నారు.  

దేశం గతిని, స్థితిని మార్చేందుకు హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా, సిద్ధాంతం తయారై వ్యాపిస్తే మనకే గర్వకారణమన్నారు. చాలామంది తెలంగాణ రాష్ట్రసమితిని భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చాలంటున్నారని కేసీఆర్ అన్నారు. కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలని, సందర్భానుసారం స్పందించే గుణం ఉండాలన్నారు. దేశంలో తుపానును సృష్టించి దుర్మార్గాలను తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉంటాయని అన్నారు. అందులో టీఆర్ఎస్ కూడా ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 

దేశంలో జరుగుతున్న మత విద్వేషాలు మంచివా? అని కేసీఆర్ ప్రశ్నించారు. పది పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికేనని అన్నారు. సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్న బెంగళూరును.. అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం చెడగొడుతోందని అన్నారు. హిజాబ్, హలాల్ అంటూ చిచ్చు పెట్టిందన్నారు. వారి దగ్గర పూలు కొనొద్దు.. పండ్లు కొనొద్దు అంటూ విద్వేషాలకు పాల్పడుతోందని చెప్పారు. ఏ వృత్తిని ఎవరైనా స్వీకరించొచ్చని, దానికి కులం, మతం తేడా లేదని అన్నారు. గాంధీ హంతకులను పూజించడం మంచిదేనా? అని ప్రశ్నించారు. మత విద్వేషాలతో దేశాన్ని ఎటు తీసుకెళ్తారని ప్రశ్నించారు. 

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఊరేగింపులో కత్తులు, తుపాకులు పట్టుకుని ఊరేగింపులు చేస్తారా? అని నిలదీశారు. దేశంలో ఇలాంటి గలీజు రాజకీయాలేంటని కేసీఆర్ మండిపడ్డారు. 

కాగా, గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పోరాడారని గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా గవర్నర్ల వ్యవస్థ మారలేదన్నారు. 12 మంది ఎమ్మెల్సీల ఫైల్ ను మహారాష్ట్ర గవర్నర్ ఏడాదిగా పెండింగ్ లో పెట్టారని, తమిళనాడు చేసిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ వ్యతిరేకించారని అన్నారు.

Related posts

తెల్లం వెంకట్రావు ఎక్కడకు వెళ్ళరు… అభద్రతా భావంలో బీఆర్ యస్ …మంత్రి పొంగులేటి

Ram Narayana

తిరుమల వెంకన్న ఆస్తులెంతో తెలుసా?… 

Drukpadam

పడుగుపాడు వద్ద గాల్లో వేళ్లాడుతున్న పట్టాలు… విజయవాడ-చెన్నై మధ్య రైళ్లు నిలిపివేత

Drukpadam

Leave a Comment