మైలేజీ ఎందుకు తగ్గిందని ప్రశ్నించిన అధికారులు.. దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ డ్రైవర్
-నిజామాబాద్‌లో ఘటన
-15 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న గణేశ్
-వారం కూడా గడవకముందే రెండోసారి కౌన్సెలింగ్‌కు పిలిచిన డీఎం
-మనస్తాపంతో దుస్తులు విప్పేసి నిరసన తెలిపిన డ్రైవర్
మైలేజీ ఎందుకు తక్కువ వస్తోందంటూ అధికారులు పదేపదే ప్రశ్నించడంతో తీవ్ర ఆవేదనకు గురైన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ దుస్తులు విప్పి నిరసన వ్యక్తం చేశాడు. నిజామాబాద్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి ఆర్టీసీ డిపో-2లో గణేశ్ 15 సంవత్సరాలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు నడుపుతున్న బస్సు మైలేజీ (కేఎంపీఎల్) తక్కువ వస్తుండడంతో ఇటీవల ఆయనను పిలిపించిన అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత వారం కూడా గడవకముందే మరోసారి గణేశ్‌ను పిలిచిన డీఐ.. కేఎంపీఎల్ తగ్గిందని, డీఎంను కలవాలని సూచించారు.
దీంతో ఆవేదన వ్యక్తం చేసిన గణేశ్ వారం వారం కౌన్సెలింగ్ పేరుతో పిలిచి ఇబ్బంది పెట్టడం సరికాదని వాపోయాడు. పాత బస్సులు ఇచ్చి మైలేజీ ఎక్కువ రావాలంటే ఎలా అని ప్రశ్నించాడు. అంతటితో ఆగక అధికారుల తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ దుస్తులు విప్పేశాడు. దీంతో అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు ఆయనను సముదాయించారు. డ్రైవర్ దుస్తులు విప్పి నిరసన తెలిపిన ఘటనపై డీఎం వెంకటేశ్ మాట్లాడుతూ.. కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్న బాధతోనే గణేశ్ అలా చేసినట్టు తెలిపారు.