పోలీసులు, అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. ఎంపీవోకు తీవ్ర గాయాలు!
-జగిత్యాల జిల్లా తుంగూరులో ఘటన
-భూ వివాదం నేపథ్యంలో రోడ్డుకు అడ్డంగా కర్రలు పాతిన గంగాధర్
-వాటిని తొలగించేందుకు వచ్చిన తహసీల్దార్, ఎస్సై, ఎంపీఓ
-వారిని అడ్డుకునేందుకు బరి తెగించిన గంగాధర్
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. రహదారికి అడ్డంగా పెట్టిన కర్రలను తొలగించేందుకు వెళ్లిన పోలీసులు, అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు యత్నించాడు. ఈ యత్నంలో భాగంగా అతడి చేతిలోని పంప్ నుంచి పెట్రోల్ మీద పడిన నేపథ్యంలో భయంతో ఎస్సై, తహసీల్దార్ పరుగులు పెట్టి ప్రమాదం నుంచి తప్పించుకోగా.. వారి వెంట వెళ్లిన ఎంపీఓ మాత్రం మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఎంపీఓ తీవ్ర గాయాలపాలు కాగా… ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన వివరాల్లోకెళితే… జగిత్యాల జిల్లా తుంగూరులో గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఓ భూ వివాదం నేపథ్యంలో రోడ్డుకు అడ్డంగా కర్రలను పాతారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ కర్రలను తొలగించేందుకు ఎస్సైతో కలిసి వెళ్లారు. వీరి వెంట ఎంపీవో రామకృష్ణ కూడా వెళ్లారు. ఎస్సై, తహసీల్దార్‌లను అడ్డుకునే క్రమంలో గంగాధర్ వారిపై పెట్రోల్ పోశారు.
ఊహించని ఈ హఠాత్పరిణామానికి తీవ్ర భయాందోళనలకు గురైన ఎస్సై, తహసీల్దార్‌లు.. గంగాధర్‌కు దూరంగా పరుగు తీశారు. అయితే గంగాధర్ బారి నుంచి ఎంపీవో రామకృష్ణ మాత్రం తప్పించుకోలేకపోయారు. రామకృష్ణపై పెట్రోల్ పోసిన గంగాధర్ ఆ వెంటనే ఆయనకు నిప్పంటించారు. ఈ ఘటనలో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.