ఏకాంతంగానే ఆర్జిత సేవలు… భక్తులకు దర్శనం మాత్రమేనన్న టీటీడీ!
- రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
- ఇప్పట్లో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లేదు
- 6న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలన్న నిర్ణయం అమలును వాయిదా వేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లను 22వేల నుంచి 15వేలకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉగాది నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని తీసుకున్న నిర్ణయంపైనా వెనక్కు తగ్గడం గమనార్హం. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాత, మరోసారి చర్చించి, ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని పాలకమండలి పేర్కొంది.
ఇక ఈనెల 13వ తేదీన శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని 6న స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నందున ఉదయం పూట భక్తులను అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దర్శనాలను నిలిపివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.