జగన్ తప్పుకుని సీఎం పదవిని బీసీలకు ఇస్తారా?: యనమల
- వైసీపీలో బీసీలు లేరు
- అందుకే టీడీపీ నుంచి వెళ్లిన వారికి రాజ్యసభ సీట్లు
- బీద మస్తాన్ రావు , ఆర్.కృష్ణయ్యలకు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీనే
- బీసీ రిజర్వేషన్లపై కేంద్రాన్ని జగన్ ప్రశ్నించారా? అన్న యనమల
ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయంపై విపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీలో బీసీలు లేరని, తెలంగాణకు చెందిన బీసీలకు రాజ్యసభ సీట్లు ఇస్తారా? అంటూ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ నిర్ణయంపై విరుచుకుపడ్డారు.
మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తప్పుకుని సీఎం సీటును బీసీలకు ఇస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు పంచి పెత్తనం చేయమంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లపై జగన్ ఎప్పుడైనా కేంద్రాన్ని ప్రశ్నించారా? అని ఆయన నిలదీశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు టీడీపీ రిజర్వేషన్లు కేటాయిస్తే వాటిని 10 శాతానికి తగ్గించింది వైసీపీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో బీసీలు లేరు కాబట్టే టీడీపీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన వారికి టికెట్లు ఇచ్చారన్నారు. బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలకు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీనేనని యనమల అన్నారు.