Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రాలను నమ్మడం లేదు: కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్!

రాష్ట్రాలను నమ్మడం లేదు: కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్!
-రోజువారీ కూలీలకు కూడా ఢిల్లీ నుంచి నేరుగా డబ్బులు పంపిస్తున్నారు
-విద్య, వైద్యం వంటి కీలక రంగాలను పట్టించుకోవడం లేదు
-ప్రతి గ్రామంలో స్పోర్ట్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం మోగించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా బీజేపీపై ఆయన విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను సంధించారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాలను పట్టించుకోకుండా… రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పనిలో కేంద్రం వేలుపెడుతోందని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాం నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు కేంద్ర ప్రభుత్వాలు చాలా చీప్ గా వ్యవహరిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూడు దశల పంచాయతీ రాజ్ వ్యవస్థ అత్యంత కీలకమని… కానీ, తొలి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలను నమ్మకుండా నేరుగా గ్రామాలకు నిధులను పంపిణీ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

జవహర్ రోజ్ గార్ యోజన, పీఎం గ్రామ్ సడక్ యోజన, ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాలకు గాను స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను పంపించడం సరైనది కాదని కేసీఆర్ అన్నారు. స్థానిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే స్పష్టమైన అవగాహన ఉంటుందని చెప్పారు. రోజువారీ కూలీలకు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వాలు నేరుగా డబ్బును పంపిణీ చేయడం సరైన చర్య కాదని అన్నారు. ఇప్పటికీ ఎన్నో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు విద్యుత్ లేక అల్లాడుతున్నాయని, ప్రజలు చీకట్లలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంచనాల మేరకు మన దేశంలో విద్య, ఉద్యోగాల కల్పనలో పెరుగుదల నమోదు కాలేదని కేసీఆర్ విమర్శించారు. ఇలాంటి కీలకమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం మానేసి.. రాష్ట్రాలకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మన దేశం పురోగతి దిశగా అడుగులు వేయడం లేదని అన్నారు.

తెలంగాణ రైతులు పండించిన మొత్తం వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ చెప్పారు. 56 లక్షల టన్నుల వరిలో ఇప్పటికే 20 లక్షల టన్నులను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ… ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. వర్షాల కారణంగా రైతులు పండించిన ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

భవిష్యత్ తరాల మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం కోసం గ్రామాలలో స్పోర్ట్స్ సెంటర్లను నిర్మించాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 24 వేల గ్రామాల్లో క్రీడా కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొన్ని స్పోర్ట్స్ సెంటర్లను రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభిస్తామని తెలిపారు.

Related posts

గుజరాత్ సీఎం రేసులో ముందున్నప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దు ?

Drukpadam

అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ. 70కి, డీజిల్ రూ. 60కే ఇవ్వొచ్చు: కేటీఆర్!

Drukpadam

హనుమకొండలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ!

Drukpadam

Leave a Comment