టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై ఎందుకు దాడి జరగలేదు?: మంత్రి విశ్వరూప్
- అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతలున్నారన్న మంత్రి
- ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు చేరారని ఆరోపణ
- ఘటనలకు కోనసీమ జిల్లా సాధన సమితి బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్య
- జిల్లా ప్రజలు సంయమనం పాటించాలన్న విశ్వరూప్
కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్లపై మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించారు. అల్లర్లలో భాగంగా అమలాపురంలోని మంత్రి విశ్వరూప్ ఇంటితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అగ్నికి ఆహుతి అయిన తన ఇంటిని విశ్వరూప్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడిన ఆయన ఈ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేనకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు. తన ఆరోపణలు నిజమని నిరూపించే దిశగా ఆయన పలు కారణాలను కూడా వెల్లడించారు.
అల్లర్లలో భాగంగా ఆందోళనకారులు తన ఇంటితో పాటు ఎమ్మెల్యే సతీశ్ ఇంటిని కూడా తగులబెట్టారని విశ్వరూప్ తెలిపారు. తమ ఇళ్లనే టార్గెట్ చేసిన ఆందోళనకారులు అక్కడికి సమీపంలోనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని ఆయన ప్రశ్నించారు.
శాంతియుతంగానే సాగుతున్న ఆందోళనల్లో సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు చేరారని ఆరోపించిన మంత్రి… వారే ఉద్యమానికి గమ్యం లేకుండా మార్చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలకు కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు, దళిత సంఘాలు సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.