Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమలాపురం అగ్నికి జిల్లా పేరు మార్పు కారణమా ? .. కుట్ర కోణం ఉందా??

అమలాపురం అగ్నికి జిల్లా పేరు మార్పు కారణమా ? కుట్ర కోణందాగి ఉందా?
అంబెడ్కర్ పేరుతొ నోటిఫికేషన్ ఎస్సీ యేతరల ఆగ్రహానికి కారణమైందా
అంబేత్కర్ ను ప్రేమించే బీసీలు సైతం రోడ్ ఎక్కడానికి కారణం ఏమిటి ?
ఎస్సీ లు నోటిఫికేషన్ రాగానే విజయోత్సవాలు జరుపుకోవడం కూడా ఒక కారణమా?
ఇద్దరు అధికార పార్టీ ఎస్సీ ప్రజాప్రతినిధులపై ఎందుకు టార్గెట్ చేసినట్లు
నిఘా వైఫల్యానికి భాద్యత ఎవరు వహిస్తారు ?

పచ్చని పంటపొలాలకు , ప్రశాంతతకు ,అప్యాయత, అనురాగాలకు,ప్రకృతి అందాలకు కోనసీమ పెట్టింది పేరు …అలాంటి కోనసీమకు కేంద్రమైన అమలాపురం అగ్నిగుండంలా మారడానికి జిల్లా పేరే కారణమా ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? కుట్ర కోణం దాగివుందా? అంబేత్కర్ ను ప్రేమించి అభిమానించే బీసీలు సైతం రోడ్ ఎక్కడానికి కారణం ఏమిటి ? కోన సీమ జిల్లాగా ప్రకటించిన దగ్గరనుంచి దాన్ని అంబెడ్కర్ జిల్లాగా ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇందులో టీడీపీ , జనసేన , బీజేపీ , సిపిఐ ,సిపిఎం పార్టీలు పాల్గొన్నాయి. ఈ ఉద్యమం జరుగుతున్నన్నాళ్లు ఎవరు ఏమి మాట్లాడలేదు . అంబెడ్కర్ జిల్లా కోసం అమలాపురంలో వేలాది మందితో ప్రశాంతంగా ప్రదర్శన నిర్వహించారు . అప్పుడు కూడా కోన సీమ జిల్లాగానే కొనసాగించాలని ఎవరు అనలేదు . సీఎం జగన్ కోనసీమ పర్యటన సందర్భంగా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఉద్యమకారుల కోరిక మేరకు కోనసీమ జిల్లాను అంబెడ్కర్ జిల్లాగా ప్రకటించాలని సీఎం ను కోరారు . అప్పుడు సీఎం సున్నితంగా దీన్ని తిరస్కరించారు . ఒక జిల్లా పేరు మార్చితే మిగతా జిల్లాల నుంచి కూడా ఇదే డిమాండ్ వస్తుందని అందువల్ల పేరు మార్పు కుదరదని ఖరాకండిగా చెప్పారు . తరువాత ఎవరు వత్తిడి ఫలించిందో కానీ కోనసీమ జిల్లాను అంబేత్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు .దీనిపై అభ్యంతరాలను 30 రోజుల్లో తెలపాలని అందులో పేర్కొన్నారు . ఇక్కడనుంచి మొదలైంది కోనసీమ జిల్లాగానే ఉంచాలనే డిమాండ్ . అందుకు కోనసీమ జిల్లా సాధన సమితి ఏర్పడింది .దీని ఆధ్వరంలోనే జిల్లా అంతటా ఉద్యమం పురుడు పోసుకుంది . అదికాస్తా అమలాపురం లో మంత్రి ఇల్లు దగ్ధం వరకు వెళ్ళింది. అధికార పార్టీకి చెందిన ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని సైతం ఆందోళన కారులు దగ్ధం చేశారు .

 

ప్రత్యేకించి ఈ దాడిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎస్సీ ప్రజాప్రతినిధుల ఇళ్లపైనే దాడులు జరగటం గమనార్హం . దాడిలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు . ఇందులో సంఘ వ్యతిరేకశక్తులు కూడా ఉండి ఉండవచ్చుననే అభిప్రాయాలూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఏచిన్న కార్యక్రమం తీసుకున్న వెంటనే వారిని గృహనిర్బంధం చేసే పోలీసులు అమలాపురానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రత్యేకించి యువకులు తరలి వస్తున్నారనే సంగతిని నిఘావర్గాలు ఎందుకు పసికట్టలేక పోయాయనేది ఆశ్చర్యకరంగా మారింది. ఈ ఉద్యమానికి అన్నెం సాయి అనే వ్యక్తి ప్రధానకారకుడిగా చెబుతున్నారు . ఇతడికి అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. అందరితో దిగిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఈదాడిసంఘటనలో పాల్గొన్నాడు . అన్ని పార్టీలకు చెందిన వారు ఇందులో ఉన్నారని ప్రాధమిక సమాచారం .మంత్రి పినిపే విశ్వరూప్ కూడా దీన్ని అంగీకరించారు . ఏపార్టీ వారైనా వదలమని చెప్పారు. సీఎం ముఖ్య సలహాదారు సజ్జల సైతం ఇదే వైఖరిని వెల్లడించారు . కానీ హోమ్ మంత్రి తానేటి వనిత మాత్రం టీడీపీ ,జనసేన పార్టీలమీద నెపం వేసింది.

అమలాపురం సంఘటన తెలుగురాష్టాలలోని ప్రజలను ఆశ్చర్యానికి ,ఆందోళనకు గురిచేసింది. అక్కడ ఇళ్ల కు నిప్పు పెట్టడమా? వీధి పోరాటాలకు దిగడమా? అది కూడ అధికార పార్టీకి చెందిన మంత్రి అద్దెకుంటున్న ఇంటితోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటికి నిప్పు పెట్టడం ఏమిటి ? ఆయన కార్యాలయం లో ఫర్నీచర్ ద్వంసం చేసి తగలబ్టెట్టడం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది . మరో ఎమ్మెల్యే ఇంటిని వదలక పోవడం చూస్తుంటే అక్కడ ప్రజలు వీధుల్లోకి వచ్చి మంత్రిని టార్గెట్ చేయడం ఇంటలిజెన్సు వైఫల్యాలను ఎత్తి చూపుతుంది. అమలాపురంలో ప్రదర్శన కోసం ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పట్టణంలోకి పెద్ద ఎత్తున ప్రజలు అందులో యువకులు,రౌడీ షీటర్లు చేరుకోవడం కచ్చితంగా నిఘాలోపమనే విమర్శలు ఉన్నాయి .

ఒక్క అమలాపురమే కాకుండా అల్లవరం ,పి గన్నవరంలలో ఆందోళన కారులు దాడులకు తెగబడ్డారు . అమలాపురంలో మంత్రి ఇంటిని తగలబెట్టిన వాళ్ళ ఇంటెన్షన్ జిల్లాపేరు మార్పుపై కాకపోవచ్చుననే అభిప్రాయాలు ఉన్నాయి. అసలే రాష్ట్రంలో సామాజిక వర్గాల పొందికలు , సమీకరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మేము పెద్దవాళ్ళం, ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మా అధికారాలు బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం ఏమిటనే దానిపై కుత కుత ఉడుకుతున్నారు. గాలికి అగ్నితోడైనట్లు జిల్లా పేరు వచ్చి చేరింది. దీంతో అమలాపురం అగ్ని గుండమైంది. మంత్రి పినిపే విశ్వరూప్ , ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీషల ఇల్లు భస్మీపటలం అయ్యాయి.

నిజంగా జిల్లాపేరు మార్పుకు ప్రజలనుంచి ఇంత రియాక్షన్ వచ్చిందా అంటే నమ్మశక్యంగా లేదు. కారణం ఏమిటా? అనే వెతుకులాటలో పడ్డారు పరిశీలకులు. జిల్లా పేరు మొదట కొనసీమ జిల్లాగానే పెట్టారు. కాని కొందరు లేదు,లేదు… డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ జిల్లాగా మార్చాలని ఆందోళనలు చేపట్టారు. వాస్తవంగా అన్ని రాజకీయ పార్టీలు కోనసీమకు అంబెడ్కర్ జిల్లాగా పెట్టాలని కోరాయి. అంబేద్కర్ జిల్లాగా నామకరణ చేయాలని దీక్షలు,ధర్నాలు ,రాస్తా రోకోలు జరిగాయి. దీనిపై ఆలోచించిన ప్రభుత్వం ఉభయ తారకంగా ఉండాలని కోనసీమ అంబేద్కర్ జిల్లాగా నోటిఫికేషన్ మాత్రమే జారీచేసింది. దీనిపై 30 రోజుల్లో అభ్యంతరాలను తెలపాలని కోరింది. ఇందులో ఎవరు అభ్యంతరాలను వారు తెలుపుకునే స్వేచ్ఛ ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆగ్రహం పెల్లుబికింది. ఎవరో కొందరు ఈ సంఘటను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తూండబట్టే అమలాపురం అగ్ని కీలల్లో చిక్కుకుంది.

 

కోనసీమ అంబేత్కర్ జిల్లాగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయటంతోనే దళితులూ తాము గెలిచామని తమమాటే నెగ్గిందని జిల్లా వ్యాపితంగా ఉత్సవాలు జరుపుకున్నారు . ఇది కొన్ని సామాజిక వర్గాలవారికి కంటగింపుగా మారింది. తమను అవమాన పరిచే చర్యగా భావించారు . ఫలితంగా దళితులకు ఇతర సామాజికవర్గాలకు మధ్య వైరం పెరిగింది. పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు . దీనికి సోషల్ మీడియా తోడైంది. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా వార్తలు షికార్లు చేశాయి.

కోనసీమ అంటే చివరగా ఉన్న ఊరు అని అర్ధ వస్తుంది. అంబేద్కర్ పేరుపై ఇంత రాద్ధాంత ఏమిటి…? దళితులూ అంబెడ్కర్ జిల్లాగా పెట్టాలని కోరినందున మిగతా వర్గాల అహం దెబ్బతిన్నదా? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ బీమ్ రావు అంబెడ్కర్ పేరుపై ఎక్కడా ఇలాంటి గొడవలు జరిగిన దాఖలాలు లేవు. అందువల్ల అసలు కారణం ఇది కాకపోవచ్చుననే అభిప్రాయాలకు బలం చేకూరుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ ,ఎస్సీ , ఎస్టీ , మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం జీర్ణించుకోలేని సెక్షన్స్ అదును కోసం చూస్తూ జిల్లా పేరు మార్పుతో దాడులకు ఉపక్రమించాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ జరిగిన దాడుల్లో అంబేత్కర్ పేరుకు వ్యతిరేకంగా బీసీలు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం .

ఇప్పటికే దాడులకు పాల్పడిన వారిని కొందరిని గుర్తించిన పోలీసులు 46 మందిని అరెస్ట్ చేశారు . మిగతా వారికోసం వివరాలు సేకరిస్తున్నారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా నిషేదాజ్ఞలు విధించారు . అసలు కారకులు ,కారణాలు తెలుసుకునేందుకు సమగ్ర విచారణ ద్వారా మాత్రమే సాధ్యమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కోనసీమ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు . చూద్దాం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో …?

Related posts

థాకరే వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఘాటు స్పందన…

Drukpadam

ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు!

Drukpadam

షర్మిల ఖమ్మం సంకల్ప సభ లో పార్టీ పేరు వెల్లడి…

Drukpadam

Leave a Comment