రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్!
-యూపీ నుంచి రాజ్యసభ బరిలో లక్ష్మణ్
-లక్నోలో నామినేషన్ పత్రాల సమర్పణ
-హాజరైన సీఎం యోగి ఆదిత్యనాథ్
బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ కె.లక్ష్మణ్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో, లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
లక్ష్మణ్ కు అనూహ్యరీతిలో రాజ్యసభ చాన్స్ లభించింది. తొలుత విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. అయితే, వివిధ సమీకరణాలు, సమతూకం, పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నేత అయిన లక్ష్మణ్ పేరును రెండో జాబితాలో చేర్చారు. లక్ష్మణ్ రాజ్యసభకు ఎన్నికైతే, పెద్దల సభలోనూ తెలంగాణ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం ఏర్పడనుంది.
లక్ష్మణ్ వంటి ఉన్నత విద్యావంతులు పెద్దల సభలో ఉండాలి: పవన్ కల్యాణ్
బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ కు పార్టీ హైకమాండ్ రాజ్యసభ అవకాశం ఇచ్చింది. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళుతున్న సీనియర్ నేత, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ గారికి తన తరఫున, జనసేన తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
విద్యార్థి దశ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన లక్ష్మణ్ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు అందించిన సేవలు ఆయను మరింత ముందుకు తీసుకెళ్లాయని వివరించారు. సామాజిక న్యాయం మాటలకు, రాజకీయ అవసరాలకు పరిమితం కాకుండా ఉండాలంటే లక్ష్మణ్ వంటి ఉన్నత విద్యావంతులు పెద్దల సభలో ఉండాలని పవన్ కల్యాణ్ అభిలషించారు. లక్ష్మణ్ గారు ఆ దిశగా తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తారనే విశ్వాసం ఉందని తెలిపారు. లక్ష్మణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.