మెక్సికోలో విద్యార్థులపై దుండగుడి కాల్పులు.. ఐదుగురు టీనేజర్లు, ఓ వృద్ధురాలి మృతి!
-మెక్సికోలోని బ్యారన్ కమ్యూనిటీలో ఘటన
-చనిపోయిన వారిలో ఇద్దరు విద్యార్థినులు
-డ్రగ్స్, దొంగిలించిన చమురు రవాణా కోసం గ్యాంగ్ వార్లు
-రెండు వారాల క్రితమే సెలాయా సిటీలో కాల్పులు
కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ లో స్కూలు విద్యార్థులపై కాల్పుల ఘటన మరువక ముందే.. మెక్సికోలోనూ అలాంటి ఘటనే జరిగింది. సెంట్రల్ మెక్సికోలోని బ్యారన్ కమ్యూనిటీలో ఓ సాయుధ దుండగుడు నిన్న రాత్రి విద్యార్థులపై కాల్పులు జరిపాడని, ఆ ఘటనలో ఐదుగురు విద్యార్థులు, ఓ 65 ఏళ్ల వృద్ధురాలు చనిపోయారని గ్వానాజువాటో రాష్ట్ర మేయర్ సీజర్ ప్రియేటో చెప్పారు. చనిపోయిన విద్యార్థుల్లో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, వారి వయసు 16 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు.
కాగా, రెండు వారాల క్రితం గ్వానాజువాటోలోని సెలాయా అనే మరో నగరంలో జరిగిన గ్యాంగ్ వార్ లో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు చనిపోయారు. మెక్సికోలో పారిశ్రామిక వాడలకు కేంద్రంగా ఉన్న గ్వానాజువాటోలో చమురు శుద్ధి కర్మాగారాలు, భారీ పైప్ లైన్లు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి చమురును దొంగిలించి అక్రమ మార్గాల్లో అమ్మడం కోసం, డ్రగ్స్ సరఫరా కోసం గ్యాంగులు పోటీ పడుతున్నాయి.
ముఖ్యంగా శాంటా రోజా డీ లీమా, జలిస్కో న్యూ జనరేషన్ అనే రెండు గ్యాంగుల మధ్య ఆధిపత్యం కోసం హోరాహోరీ పోరు సాగుతోంది. వాటి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. పైగా హత్యలు పెరిగిపోయాయి. 2006 డిసెంబర్ లో ఆ దేశ ప్రభుత్వం డ్రగ్ దందాపై ఓ వివాదాస్పద మిలటరీ ఆపరేషన్ నిర్వహించినా అది సక్సెస్ కాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 3.40 లక్షల మంది గ్యాంగ్ వార్ లలో చనిపోయినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.