Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా… పరిగెత్తిస్తా… చంద్రబాబు

ఈ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా… పరిగెత్తిస్తా!: శ్రీకాళహస్తిలో చంద్రబాబు రోడ్ షో
  • తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక
  • టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి
  • శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
  • ప్రజల చేతుల్లో ఉన్న ఓటే ఆయుధమని ఉద్ఘాటన
Chandrababu roadshow in Srikalahasti

టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షోలో పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ఆయన ప్రచారం చేశారు. ఈ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ సర్కారుపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలను కూడా పరిగెత్తిస్తాం తప్ప రౌడీలకు భయపడే సమస్యేలేదని స్పష్టం చేశారు. ఇవాళ తాను ఎలాంటి సమస్య లేకుండా నడచి వచ్చానని, అందుకు కారణం తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుండడమేనని అన్నారు.

“అదే అధికారి, ఇదే పోలీసులు, ఇదే తహసీల్దారు, అదే కలెక్టరు… పంచాయతీ ఎన్నికల సమయంలో మీరు ఏవిధంగా ప్రవర్తించారు? ఇప్పుడు ఏవిధంగా ఉన్నారు? ప్రజలే గమనించాలి. మీకు ప్రజాస్వామ్యం కావాలా వద్దా? ఇదే అంశాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? మా తప్పేదైనా ఉంటే ప్రజలకు వివరించు. అంతే తప్ప తప్పుడు కేసులు పెడతారా? ఇప్పుడందరూ మళ్లీ నేనే ముఖ్యమంత్రిగా రావాలంటున్నారు. నాకేమైనా సీఎం పదవి కొత్తా! 14 ఏళ్లు చేశాను. నా రికార్డు ఎవరూ బద్దలు కొట్టే పరిస్థితి లేదు. 9 ఏళ్లు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. అదొక రికార్డు. పదేళ్లు విపక్షనేతగా ఉన్నాను. మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు కాబట్టి నా రికార్డు పదిలంగా ఉంటుంది.

ప్రజలు కూడా టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు తేడా గమనించాలి. తిరుపతి ఉప ఎన్నికతోనే మార్పుకు శ్రీకారం చుట్టాలి. అలాకాకుండా కొంప కాలిపోయిన తర్వాత తీరిగ్గా బయటికొచ్చి బావి తవ్వితే ఏం ఉపయోగం ఉండదు. ఇవాళ నేను తిరుపతి వచ్చింది పదవి కోసం కాదు… టీడీపీ తరఫున ఓ ఎంపీ గెలిస్తే మరింత బలం పెరుగుతుందని రాలేదు. అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే అది మీ చేతుల్లోనే ఓటు రూపంలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చా.

ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టుకుంటూ పోయాడు. ఇప్పుడా ముద్దులన్నీ ఏమైపోయాయి? ప్రజలకు గుద్దులే మిగిలాయి. హోదాపై కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాడట. అడుగుతూనే ఉండడానికా నీకు ఓటేసింది? నీ నంగి మాటలు మాకు చెబుతావా? నీ వైఖరితో ప్రత్యేక హోదా పోయింది, పెట్టుబడులు పోయాయి. కేసులకు భయపడి ఇంట్లో ఉంటే సమాజం ఎలా బాగుపడుతుంది? రాష్ట్రం దివాళా తీసిన తర్వాత చేయడానికి ఏం ఉండదు. ప్రజలు ముందుకొచ్చి పోరాడితేనే ఫలితం ఉంటుంది” అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు.

Related posts

హాలియా సభలో కాంగ్రెస్ , బీజేపీలపై మండిపడ్డ కేసీఆర్

Drukpadam

టీపీసీసీ ప్రచార కమిటీ కోఛైర్మన్ గా పొంగులేటి…

Drukpadam

మునుగోడులో మాతో పని లేదు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Drukpadam

Leave a Comment