మీ స్టేషన్ కు వచ్చి కొడతానంటూ ఎస్ ఐకి రేణుక వార్నింగ్!
ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి.. టీఆర్ఎస్ స్పందన
కాంగ్రెస్ పార్టీ ఛలో రాజ్ భవన్ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్న టీఆర్ఎస్
రాహుల్ గాంధీని విచారిస్తున్న ఈడీ
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
హైదరాబాద్ లో రాజ్ భవన్ ను ముట్టడించేందుకు యత్నం
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో ఈడీ విచారణ మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. గాంధీ కుటుంబం గౌరవాన్ని దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వారు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
ఈ నిరసనల్లో భాగంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. రాజ్ భవన్ ముట్టడికి నేతలు, కార్యకర్తలు కదలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక ఎస్సై కాలరును ఆమె పట్టుకున్నారు. తనను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్సైని ఆమె హెచ్చరించారు.
ఈ సందర్భంగా తనను అడ్డుకోబోయిన పోలీసులపై కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మండిపడ్డారు. పంజాగుట్ట ఎస్సై కాలర్ ఆమె పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అక్కడి నుంచి పోలీసు వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు రేణుక వార్నింగ్ ఇచ్చారు. మీ స్టేషన్ కు వచ్చి మిమ్మల్ని కొడతానంటూ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో రేణుకా చౌదరిపై టీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్నారని, పోలీసులపై దాడికి పాల్పడుతున్నారని విమర్శించింది. ఇలాంటి రౌడీలను అరెస్ట్ చేయాలని, వారు చేసిన డ్యామేజీకి వారి నుంచి పరిహారం వసూలు చేయాలని చెప్పింది. కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది. పోలీసులను తిట్టడం, కొట్టడం వంటివి తెలంగాణ కాంగ్రెస్ నేతల మనస్తత్వాన్ని చూపెడుతున్నాయని వ్యాఖ్యానించింది.