కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి హింసాత్మకం బస్సు అద్దాలు ధ్వంసం, బైక్ దహనం!
-రేవంత్,భట్టి ,రేణుక సహా పలువురు నేతల అరెస్ట్
-డిసిపి డేవిస్ జోయల్ చొక్కా పట్టుకున్న భట్టి
-ఎస్ ఐ కాలర్ పట్టుకున్న రేణుక చౌదరి
-రోడ్ పై భైఠాయించిన రేవంత్ రెడ్డి ….పోలిసుల తోపులాటలో కిందపడ్డ శ్రీధర్ బాబు …
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ జరపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు ఓ ద్విచక్ర వాహనానికి రోడ్డుపైనే నిప్పుపెట్టి తగలబెట్టారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాక, బస్సుపైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో ప్రయాణికులు అక్కడ్నుంచి వేరే మార్గాల్లో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజ్ భవన్ మార్గంలో పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అయినా వాటిని తొలగించి కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వైపు ముందుకు కదిలారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, అంజన్ కుమార్ యాదవ్ తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. కాగా, కాంగ్రెస్ నేతలు చేసిన విధ్వంసానికి పోలీసుల వైఖరే కారణమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
అరెస్టు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పోలీసులతో వాగ్వాదానికి దిాగారు. అంతేగాక, డీసీపీ జోయెల్ డేవిస్ చొక్కా పట్టుకుని తోసేశారు. ఆ తర్వాత పోలీసులు భట్టిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై బైఠాయించడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులకు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
రాజ్ భవన్ వైపు వెళుతున్న కాంగ్రెస్ నేత రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, అక్కడున్న పంజాగుట్ట ఎస్ఐ చొక్కా పట్టుకుని.. పోలీస్ స్టేషన్ కు వచ్చి కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు రేణుకా చౌదరి. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులపై రేణుకా చౌదరి చేయి చేసుకున్నారు. ఆ తర్వాత రేణుకను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తించిన క్రమంలో రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది
కావాలనే నన్ను అరెస్ట్ చేశారు …నేను రాజ్ భవన్ కు వెళ్ళలేదు: రేణుక చౌదరి
రోడ్ మీద ఉన్న నన్ను పోలీసులు ప్రోవోక్ చేశారు…
నేను పోలిసుల దగ్గరకు వెళ్ళలేదు…వారే నాదగ్గరకు వచ్చారు …
నేను నావెహికిల్ దగ్గరకు వెళుతున్నానని చెప్పాను
నా మీద ఏ సెక్షన్ కింద కేసు పెడతారు…
రాహుల్ గాంధీ ని నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో గత మూడు రోజులుగా ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజ్ భవన్ కు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను పోలీసులు అడ్డగించడంతో తోపులాటలు వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. కేంద్రమాజీ మంత్రి రేణుక చౌదరి కి పోలీసులకు జరిగిన వివాదంలో రేణుక చౌదరి ఒక ఎస్ ఐ కాలర్ పట్టుకోవడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు . వెంటనే రేణుక చౌదరిని అరెస్ట్ చేశారు . ఇది అన్యాయం అని తాను రాజ్ భవన్ కు వెళ్లకుండానే తన వెహికిల్ దగ్గరకు వెళుతుండగా పోలీసులు అటకాయించి ఇష్టం మోచినట్లు మాట్లాడారని అందువల్ల వారిని ప్రశ్నించానని అది నేను చేసిన నేరమా ? అని ఆమె ప్రశ్నించారు .
పోలీసులు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారని ఆమె ఆరోపించారు . ఇది ఎక్కడి న్యాయం రోడ్ మీద నడిచే హక్కు కూడా లేదా ? నా వెహికిల్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు .