క్షమాపణ చెప్పి అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోండి: రాహుల్ గాంధీ!
- వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని చెప్పానన్న రాహుల్
- రైతుల నిరసనల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్య
- ఇప్పుడు అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం వివాదాస్పదంగా మారింది. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలో పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ… రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. ఇదే విధంగా సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోక తప్పదని అన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని తాను గతంలోనే చెప్పానని… చివరకు తాను చెప్పిందే జరిగిందని తెలిపారు. ఇప్పుడు కూడా యువతకు క్షమాపణలు చెప్పి అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే దేశవ్యాపితంగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి . మొదట బీహార్ లో ప్రారంభమైన అల్లర్లు హర్యానా , ఉత్తర ప్రదేశ్ , తెలంగాణ కు వ్యాపించాయి. సికింద్రాబాద్ లో రైల్వేస్టేషన్ లో జరిగిన కాల్పుల్లో ఒక యువకుడు మరణించగా అనేకమంది గాయపడ్డారు . రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయి. బోగీలను తగలబెట్టారు . అనేక రాజకీయపార్టీలు కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసిన కేంద్రం తన మొండివైఖరిని వీడటం లేదనే విమర్శలు ఉన్నాయి.