మరో 111 పార్టీల గుర్తింపు రద్దు… రీజనిదేనంటూ ఈసీ ప్రకటన!
-ఈసీ జాబితా నుంచి 111 పార్టీలు అవుట్
-విరాళాల వివరాలు అందజేయకపోవడమే కారణమట
-కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన
దేశంలోని పలు రాజకీయ పార్టీల గుర్తింపును ఇటీవలే రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సోమవారం కూడా మరికొన్ని పార్టీలపై కొరఢా ఝుళిపించింది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 111 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీల పేర్లను తమ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. 2021 వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2858 రిజిస్టర్డ్ పార్టీలు ఉండగా వాటిలో 8 జాతీయపార్టీలు ,54 ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. వాటిలో 2797 పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలుగా ఉన్న గుర్తింపు లేని పార్టీలుగానే ఉన్నాయి.
తామర తుంపర్లుగా పుట్టిన రాజకీయపార్టీల ఎన్నికల సంఘానికి సరైన వివరాలు అందించని కారణంగా వివరాలు అందించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఇవ్వని కారణంగా దేశంలో ఉన్న పార్టీలలో 111 పార్టీల రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇకపై వాటి రిజిస్ట్రేషన్ లేదని ,రెజిస్ట్రర్డ్ పార్టీలుగా కూడా గుర్తించే అవకాశం లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడానికి గల కారణాలను కూడా ఈసీ వెల్లడించింది. ఆయా పార్టీలకు వచ్చిన విరాళాలు, చందాలను పార్టీలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా 111 పార్టీలు నడుచుకోలేదట. ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చినా కూడా ఈ పార్టీలు స్పందించలేదట. దీంతో 111 పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.